మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్
తిరుపతి టాస్క్ఫోర్స్ (ఆంధ్రప్రభ): రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై జరిగిన నేరానికి సంబంధించి నమోదు చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిందితుడైన చీరాల రమేష్ బాబును అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ & చట్టపరమైన చర్యలు..
కేసు దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలు, సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట నిందితుడి ప్రమేయం నిర్ధారణ కావడంతో 03.10.2026న అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడికి చట్టపరమైన నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం, జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం గౌరవనీయులైన కోడూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
గోప్యత పాటించాలని పోలీసుల విజ్ఞప్తి..
బాధితురాలు మైనర్ బాలిక కావడంతో చట్ట ప్రకారం ఆమె గుర్తింపు, వ్యక్తిగత వివరాలు మరియు కుటుంబ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ నిష్పక్షపాతంగా, శాస్త్రీయంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు.. మీడియాకు కీలక విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లేదా గుర్తింపు తెలిపే వివరాలను సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని, బాధితురాలి గోప్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు.
