ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్పంలో దుర్ఘటన

ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దొనబండ క్వారీలో కొండపై నుంచి జారిపడి ఓ కార్మికుడు సోమవారం మృతి చెందాడు. సేకరించిన సమాచారం ప్రకారం ఆర్పీఆర్ క్వారీలో పనిచేసే ఉప్పతల కృష్ణ (25) కొండపైన బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ చేస్తుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.

హుటాహుటిన సమీపంలోని ప్రైవేటు హాస్పటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదం అంచున పనిచేస్తున్నారు. క్వారీ యజమానుల నిర్లక్ష్యంతో కార్మికులు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. ఇప్పటికైనా క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడి మృతి

ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికులతో పని చేయిస్తున్న యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం బలైందని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.హరికృష్ణారెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కొప్పుల కుమార్, రవీంద్ర ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply