అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం
పెద్దపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ‌: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులు, రాఘవపూర్‌లో ఇందిరా మహిళా శక్తి భవనం, పెద్దపల్లి బస్‌ డిపో, కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప‌నుల‌ పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అప్పన్నపేటలో బైపాస్‌ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి భవనం పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు తెలియ‌జేవారు. భవనానికి వెళ్లే అప్రోచ్‌ రోడ్డుకు అవసరమైన మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని చెప్పారు. అలాగే, పెద్దపల్లి బస్‌ డిపో నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌.. ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఫ్లైఓవర్‌ పనుల్లో జాప్యం వద్దు.
కూనారం రైల్వే ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ వైరింగ్‌, స్తంభాల మార్పిడి పనులను త్వరగా పూర్తిచేసి తదుపరి నిర్మాణ పనులకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. పర్యటనలో పెద్దపల్లి ఆర్డీఓ బి. గంగయ్య, డీఈ రమణారెడ్డి, ఏఈ రాజ్‌కుమార్‌, ఈఈ పీఆర్‌ శంకరయ్య, గోదావరిఖని డిపో మేనేజర్‌ కవిత, రైల్వే జేఈ జానకిరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ భావ్‌సింగ్‌, తహసీల్దార్‌ రాజయ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.