విమానాశ్రయాల పనులు వేగవంతం చేయండి

  • కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కీలక భేటీ
  • ఆదిలాబాద్‌, మామునూరు ఎయిర్‌పోర్టులపై సీఎం దృష్టి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో విమాన కనెక్టివిటీని మరింత పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి… ఆదిలాబాద్, మామునూరు విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరారు. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి అప్పగించిందని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. విమానాశ్రయ పనులను వేగంగా ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన రామ్మోహన్‌నాయుడు.. మామునూరు ఎయిర్‌పోర్ట్‌ టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్‌లోగా ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. అదే నెలలో పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆదిలాబాద్‌ విమానాశ్రయ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. అక్కడ రన్‌వే తుది రూపకల్పనకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో ప్రయాణికుల టెర్మినల్‌తో పాటు కార్గో టెర్మినల్‌, విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్‌ సదుపాయాలు (ఎంఆర్‌వో) ఏర్పాటు చేయాలని కోరారు.

తెలంగాణలో హెలీ టూరిజం అభివృద్ధికి సహకరించాలని కూడా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లో సీ ప్లేన్‌ ల్యాండింగ్‌ అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు.

మెరుగైన విమాన రవాణా సదుపాయాలు తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, పర్యాటక రంగ విస్తరణకు కీలకంగా మారుతాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్‌ షెట్కార్‌, ఎం. అనిల్‌కుమార్‌ యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్‌) హర్కార వేణుగోపాల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.