TG | టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలు..
ఇళ్లు, మున్సిపల్ కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు
TG | ఆంధ్రప్రభ, సూర్యాపేట : సూర్యాపేట టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య నివాసంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు, అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమయ్యకు సంబంధించిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
సూర్యాపేట మానసానగర్‌లోని సోమయ్య నివాసంతో పాటు హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదాయ వనరులు, ఆస్తుల విలువ, వాటికి సంబంధించిన పత్రాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలోని రికార్డులను కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన పలు దస్త్రాలు, అధికారిక రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, గుర్తించిన ఆస్తుల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
