అవినీతి ఆరోపణల నేపథ్యంలో….

అవినీతి ఆరోపణల నేపథ్యంలో….

నరసరావుపేట సబ్‌- రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు…!!
సత్తెనపల్లి, పిడుగురాళ్ల పై కూడా పలు అనుమానాలు


నరసరావుపేట( ఆంధ్రప్రభ): పల్నాడు జిల్లా, నరసరావుపేట సబ్- రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు (Sudden attacks) నిర్వహించారు. అధికారులు కార్యాలయ రికార్డులను జాగ్రత్తగా పరిశీలిస్తూ, అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించారు. కార్యాలయానికి తాళాలు వేసి, లోపల దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సబ్- రిజిస్ట్రార్ కార్యాలయంపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం, దస్తావేజు రైటర్లకు, రిజిస్ట్రార్ మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు నడుస్తున్నట్లు ఆరోపణలు పొడచూపుడంతో ఈ దాడులకు ఆద్యం పోసినట్లు అయిందని స్థానికులు గుస, గుసలాడుతున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో…రిజిస్ట్రార్ ఆఫీసు పరిసరాల్లో ఉన్న షాపులను వ్యాపారస్థులు మూసివేశారు.


మరోవైపు సత్తెనపల్లి సబ్- రిజిస్టర్ కార్యాలయం (Sattenapalli Sub-Registrar Office) లో తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన ఐదుగురిపై కేసు నమోదు అయ్యింది. తప్పుడు పత్రాలతో స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, సత్తెనపల్లి సబ్ రిజిస్ట్రార్ అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు చెప్పారు. అమరావతి మండలం, మునగోడు గ్రామానికి చెందిన ఉషారాణికి ఏడున్నర సెంట్ల స్థలం పెదకూరపాడు సబ్- రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉంది. “ఎనీవేర్ రిజిస్ట్రేషన్” విధానంలో భాగంగా ఉషారాణికి చెందిన స్థలానికి సర్వే నంబర్లు మార్చి.. తప్పుడు పత్రాలు సృష్టించి మునగోడు గ్రామానికి చెందిన గలబా రాములు, రాఘవమ్మ, శ్రీనివాసరావు, గోవిందమ్మ, వెంకట్రావు లు కలిసి సత్తెనపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక సబ్- రిజి స్టార్ అశోక్, అయిదుగురిపై ఫిర్యాదు చేయడంతో వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతూ ఉంది.

ఈ నేపథ్యంలో అనుకోకుండా నరసరావుపేట (Narasaraopet) సబ్- రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరగడంతో ఇక్కడ అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. అంటే దీనిని బట్టి చూస్తే సత్తెనపల్లి రిజిస్టర్ కార్యాలయంలో కూడా దొంగ రిజిస్ట్రేషన్ జరిగినట్లు అవగతమవుతుంది. అంతేకాకుండా పిడుగురాళ్ల సబ్- రిజిస్టర్ కార్యాలయంలో కూడా జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, అవినీతి ఆరోపణపై కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టిని సారించినట్లు సమాచారం. ఈ రెండు కార్యాలయాలే కాకుండా మరికొన్ని కార్యాలయాల్లో కూడా ఇటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు “ప్రత్యేక నిఘా” ఉంచినట్లు విశ్వసనీ య వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్వహించడంతో… మిగతా కార్యాలయంలో కూడా సిబ్బంది, అధికారులు ఈ సమాచారం అందుకొని, విధులకు డుమ్మా కొట్టినట్లు తెలిసింది.

Leave a Reply