- ఏసీబీకి పట్టుబడి….
- వికారాబాద్ మున్సిపల్ అధికారి అవినీతి బాగోతం..
వికారాబాద్ : వేలకు వేల రూపాయల జీతం పొందుతూ రూ.15 వేలు లంచానికి ఆశపడిన ఓ మున్సిపల్ అధికారి (Municipal officer) ఏసీబీ చిక్కాడు. వికారాబాద్ జిల్లా (Vikarabad District) తాండూరు మునిసిపల్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం దాడి చేశారు. ఈ రోజు తాండూరు మునిసిపల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో రెవెన్యూ అధికారి(ఆర్ఓ)గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
గత మునిసిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసిన ఇర్షాద్ తన వార్డు పరిధిలో ఒక ఇంటికి నెంబర్ కేటాయించాలని ఆర్ఓ రమేష్ ను ఆశ్రయించారు. ఒక ఇంటికి నెంబర్ కేటాయించేందుకు రూ.20 వేలు ఇవ్వాలని వికారాబాద్ మునిసిపల్ ఆర్ఓ రమేష్ (RO Ramesh) డిమాండ్ చేశారు. ఇందులో రూ.15 వేలు లంచంగా ఇస్తానని బాధితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
వారి సూచన మేరకు తాండూరు మునిసిపల్ కార్యాలయం (Tandur Municipal Office) లో రమేష్‌కు బాధితుడు లంచం ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఏసీబీ దాడుల సమాచారం తెలిసిన వెంటనే కార్యాలయంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న అధికారులు..సిబ్బంది క్షణాల్లో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఏసీబీ (ACB)కి చిక్కిన రమేష్ వచ్చే ఏడాది జూన్ లో ఉద్యగో విరమణ చేయాల్సి ఉంది. అంతలోనే ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. రెండేళ్ల క్రితం తాండూరు సబ్ రిజిస్ర్టార్ ను కూడా ఇర్షాద్ ఏసీబీకి పట్టించారు.