అంతర్జాతీయ ఆటగాళ్లకు రూ.10 లక్షల బీమా
దివ్యాంగ క్రీడాకారులను సాధారణ క్రికెటర్లతో సమానంగా తీర్చిదిద్దుతాం
దేశం కోసం ఆడే ప్రతి క్రీడాకారుడి ఆరోగ్య భద్రత మా బాధ్యత
ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని
ప్రతిభకు ప్రోత్సాహం.. క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట
ఏసి ఏ కార్యదర్శి సానా సతీష్‌బాబు
గాయాలతో ఎదురైన ఇబ్బందులే స్ఫూర్తి.. ఐదుగురికి బీమా కల్పించిన అజయ్‌కుమార్‌రెడ్డి
లార్డ్స్, శ్రీలంకల్లో సత్తాచాటిన డెఫ్ క్రికెటర్లకు ఘన సన్మానం
(విజయవాడ, ఆంధ్రప్రభ) : దేశం కోసం అంతర్జాతీయ వేదికలపై పోరాడుతున్న అంధ క్రికెటర్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అండగా నిలిచింది. వారి ఆరోగ్యం, భద్రత, భవిష్యత్‌కు భరోసా కల్పించేలా ఐదుగురు అంతర్జాతీయ అంధ క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీలను అందించింది. విజయవాడలోని ఏసీఏ పరిపాలనా కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రధాన కార్యదర్శి సానా సతీష్‌బాబు క్రీడాకారులకు పాలసీలను అందజేశారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (డీసీసీఏపీ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్న దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారికి అండగా నిలవడం బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. సాధారణ క్రికెటర్లతో సమానంగా దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ, వారి అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను ఏసీఏ అందిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు ఆరోగ్య భద్రత, ప్రోత్సాహం కల్పించడంలో ఏసీఏ ముందుంటుందని స్పష్టం చేశారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీష్‌బాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. మెరుగైన శిక్షణ, అవసరమైన వసతులు, ప్రోత్సాహకాలు, భద్రత కల్పిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరింత మంది దివ్యాంగ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఏసీఏ కృషి చేస్తుందని చెప్పారు.
ఈ బీమా పాలసీల ఏర్పాటులో భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇ. అజయ్‌కుమార్‌రెడ్డి కీలక చొరవ తీసుకున్నారు. భారత జట్టు తరఫున ఆడుతున్న సమయంలో తాను పలుమార్లు తీవ్ర గాయాలకు గురయ్యానని, సరైన ఆరోగ్య బీమా లేక చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. తనకు ఎదురైన పరిస్థితి మరే అంధ క్రికెటర్‌కు రాకూడదనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ఐదుగురు అంధ క్రికెటర్లకు రూ.10 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించేందుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. బీమా పాలసీలు అందుకున్న వారిలో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ దుర్గారావుతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు వెంకటేష్, రవి, దున్న వెంకటేశ్వరరావు, సత్యవతి ఉన్నారు.
లార్డ్స్‌లో మెరిసిన యశ్వంత్.. శ్రీలంకలో జోష్నా సత్తా..
ఇదే కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన డెఫ్ క్రికెటర్లను ఏసీఏ ఘనంగా సత్కరించింది. ఇంగ్లండ్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగిన మిక్స్డ్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని దేశానికి గుర్తింపు తీసుకువచ్చిన యశ్వంత్ నాయుడును, శ్రీలంకలో జరిగిన అంతర్జాతీయ డెఫ్ అండ్ డంబ్ మహిళల క్రికెట్ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన జోష్నా రెడ్డిని కేశినేని చిన్ని, సానా సతీష్‌బాబు ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి వారి ప్రతిభను అభినందించారు. సీఏబీఏపీ రాష్ట్ర కార్యదర్శి జి. రవీంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగ క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగ క్రికెట్‌కు ఏసీఏ అందించిన ఆర్థిక సహకారంతో పాటు క్రీడాకారులకు అందిస్తున్న నిరంతర ప్రోత్సాహానికి ఏసీఏ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీఏపీ ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, వివిధ సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
