SRHకు షాకిచ్చే ప్లాన్​లో అభిషేక్‌..

  • ఎస్‌ఆర్‌హెచ్‌కు షాకిస్తాడా?
  • కెప్టెన్సీ విషయంలో అసంతృప్తి..
  • అభిషేక్‌ శర్మపై పలు ఫ్రాంచైజీల కన్ను..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఐపీఎల్‌ 2027కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటుచేసుకోనుందంటూ ప్రచారం మొదలైంది. హైదరాబాద్‌ జట్టు స్టార్‌ ఓపెనర్ అభిషేక్‌ శర్మ.. ఫ్రాంచైజీపై అసంతృప్తితో ఉన్నాడని, వచ్చే సీజన్‌కు ముందు జట్టును వీడే ఆలోచనలో ఉన్నాడని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. , అభిమానులు ముద్దుగా ‘పులి’ అని పిలుచుకునే అభిషేక్‌… కెప్టెన్సీ విషయంలో ఆశలు పెట్టుకున్నాడని, ప్రస్తుత పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నాడన్నది ఈ ప్రచారం జ‌రుగుతుంది.

కెప్టెన్సీపై గుర్రు?

అభిషేక్‌ శర్మ 2019 నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌తో కొనసాగుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన అతడికి కెప్టెన్సీపై ఆసక్తి ఉందని ప్రచారం జరుగుతోంది. పాట్‌ కమిన్స్‌ అందుబాటులో లేని సమయంలో 2025 సీజన్‌లో ఇషాన్‌ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై అభిషేక్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ఓ వర్గం పేర్కొంది. కమిన్స్‌ భవిష్యత్‌లో ఐపీఎల్‌ బాధ్యతల నుంచి త‌ప్పుకుంటే… ఇషాన్‌ కిషన్‌నే పూర్తి స్థాయి కెప్టెన్‌గా కొనసాగించే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా ఈ ఊహాగానాలకు కారణమైంది.

ముంబై.. గుజరాత్‌.. పంజాబ్‌?

దీంతో అభిషేక్‌ శర్మను తమ జట్టులోకి తీసుకునేందుకు ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ వంటి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీతోనూ అధికారిక ట్రేడ్‌ ఒప్పందం ఖరారు కాలేదు. ఒకవేళ ఎస్‌ఆర్‌హెచ్‌, అభిషేక్‌ విడిపోవాలని నిర్ణయించుకుంటే.. ఆటగాడి ట్రేడ్‌, నగదు ఒప్పందం లేదా వేలానికి ముందు విడుదల చేయడం వంటి మార్గాల్లో ఏదో ఒకటి తెరపైకి రావచ్చని అంచనాలు ఉన్నాయి.

‘అంతా అబద్ధమే’.. క్లారిటీ ఇచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌

అభిషేక్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడనున్నాడన్న వార్తలను జట్టు సీఈఓ కే.షణ్ముగం స్పష్టంగా ఖండించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. ఇక ఐపీఎల్‌ 2025లో అభిషేక్‌ శర్మ బ్యాట్‌తో అదరగొట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 439 పరుగులు చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌పై 55 బంతుల్లో 141 పరుగులు అతడి అత్యుత్తమ స్కోరు. ఈ సీజన్‌లో 33.77 సగటుతో, 193.39 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. 46 ఫోర్లు, 28 సిక్సర్లు బాదాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ విభాగంలో కీలక ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతడి భవిష్యత్తుపై వస్తున్న వార్తలు ఊహాగానాల స్థాయిలోనే ఉన్నాయి. ఐపీఎల్‌ 2027 రిటెన్షన్‌, ట్రేడ్‌ విండోకు ముందు ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.