పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే, నేహా బోరా
- కన్నాట్ ప్లేస్‌కు వెళ్తుండగా దీప్కేను అడ్డుకున్న పోలీసులు
- మండి హౌస్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వెంటనే నేహా బోరా నిర్బంధం
- సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులకు నిరసనగా కార్యక్రమం..
- ట్రాఫిక్, ప్రజల భద్రత దృష్ట్యా రద్దు చేసుకోవాలని పోలీసుల సూచన
న్యూఢిల్లీ: కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, విద్యార్థి నాయకురాలు నేహా బోరాలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో నిర్వహించ తలపెట్టిన ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా దీప్కేను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు మండి హౌస్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన వెంటనే నేహా బోరాను అదుపులోకి తీసుకున్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం, ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడం, వ్యాపారులు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగే అవకాశాలున్నాయని పేర్కొంటూ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని ఢిల్లీ పోలీసులు దీప్కేను కోరారు. అయితే ఆయన నివాసం నుంచి బయటకు వచ్చి వీధి వైపు నడుస్తుండగా పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆయన్ను పోలీసు వాహనంలో తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కన్నాట్ ప్లేస్‌లో అమల్లో ఉన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను ఉటంకిస్తూ, ముందుజాగ్రత్త చర్యగా దీప్కేను నిర్బంధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దాస్, రాంకా అరెస్టులకు నిరసనగా కార్యక్రమం
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులకు నిరసనగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ‘లెహ్రా దో తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా గుర్తించే హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత, అక్కడ బారికేడ్లను దాటారనే ఆరోపణలపై సీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి దాస్, రాంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
భారతదేశంలో ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్‌ఐఆర్) ప్రక్రియలో లోపాలున్నాయని ఆరోపిస్తూ సీజేపీ, ప్రతిపక్ష బృందాలు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అక్టోబర్ 10 నుంచి పరిణామాలు ఇలా..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న నిరసన తెలిపేందుకు సీజేపీ చేసిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు సీఈసీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు వైపు ర్యాలీ నిర్వహించారు.
తదనంతరం దీప్కే, దాస్, రాంకాలను కోర్టు విడుదల చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్‌కు నిరసన ప్రదేశంగా ఉన్న హోదాను రద్దు చేసింది. ఈ పరిణామాల అనంతరం దాస్, రాంకా సహా సీజేపీ సభ్యులు జంతర్ మంతర్‌కు చేరుకుని కొంతసేపు నిరసన తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని ఊపిన వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
‘లెహ్రా దో తిరంగ్’ కార్యక్రమానికి సంబంధించి తాజా పరిణామాలు కొనసాగుతుండగా, దీప్కే, నేహా బోరాల నిర్బంధంతో ఢిల్లీలో నిరసనలపై మరోసారి చర్చ మొదలైంది.
