చేవెళ్ల విషాదానికి ఏడాది… గుండె కోత మిగిల్చిన ప్రమాదం!

చేవెళ్ల, ఆంధ్రప్రభ: కాలం గడుస్తోంది.. రోజులు దొర్లిపోతున్నాయి.. కానీ ఆ కుటుంబాల గుండెల్లో రగులుతున్న విషాదం మాత్రం చల్లారడం లేదు. ఏడాది క్రితం జరిగిన ఆ ఘోర రోడ్డు ప్రమాదం 19 కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. కళ్లముందే తమవారిని కోల్పోయిన వారి వేదనకు కాలం కూడా మందు కాలేకపోతోంది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో టిప్పర్‌–బస్సు ఢీకొన్న దుర్ఘటనకు నేటితో ఏడాది పూర్తయింది.

నవంబర్‌ 3, 2025 ఆ రోజు జరిగిన ప్రమాదం ఎన్నో జీవితాలను ఒక్కసారిగా తలకిందులు చేసింది. బస్సు ప్రయాణం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తుందని భావించిన వారు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు తమతో నవ్వుతూ, మాట్లాడిన ఆత్మీయులు ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక బాధిత కుటుంబాలు నేటికీ కన్నీరు పెడుతున్నాయి.

ప్రమాదం జరిగి ఏడాది గడిచినా ఆ భయానక దృశ్యాలు స్థానికుల కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబాలకు ప్రతి రోజు ఓ జ్ఞాపకమే అయినా.. ప్రమాదం జరిగిన తేదీ మాత్రం వారి గుండెల్లో గాయం మరోసారి రేపుతోంది. పండుగలు, కుటుంబ వేడుకలు వచ్చినా తమవారు లేని లోటు వారిని వెంటాడుతోంది.