14వ వర్ధంతి సందర్భంగా నిమ్మాడలో స్మరణాంజలి

14వ వర్ధంతి సందర్భంగా నిమ్మాడలో స్మరణాంజలి

  • స్మృతివనం వద్ద పుష్పాంజలి ఘటించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
  • ఎర్రన్న సేవలను గుర్తుచేసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు

కోటబొమ్మాళి, నవంబర్ 2 (ఆంధ్రప్రభ): దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 14వ వర్ధంతి కార్యక్రమం సోమవారం ఆయన స్వగ్రామమైన నిమ్మాడలో భావోద్వేగ వాతావరణంలో జరిగింది. ఆధునికీకరించిన స్మృతివనం వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఎర్రన్నాయుడు తమ్ముడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కుమారుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్మృతివనం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయన సోదరులు హరివరప్రసాద్, ప్రభాకరరావు, సతీమణి విజయకుమారి, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయులు, అభిమానులు పాల్గొని ఎర్రన్నాయుడును స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రజా జీవితంలో ఆయన అందించిన విశేష సేవలు, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవకు ఆయన చేసిన కృషి, చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

వర్ధంతి కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పార్టీ సీనియర్ నాయకులు బోయిన గోవిందరాజులు, అరవల రవీంద్ర, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, పూజారి శైలజ, బాడాన వెంకటరమణమ్మ, బోయిన సత్యశ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.