జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొఖుమ్‌ నగరంలోని హోఫ్‌స్టెడే ప్రాంతంలో ఓ నివాస భవనంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి అనుమానితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది.

మృతుల్లో 25, 27 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు, 26 ఏళ్ల యువకుడు ఉన్నారు. వీరంతా భారతీయులేనని బొఖుమ్‌ పోలీసులు ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే మృతుల పేర్లు, భారత్‌లోని స్వస్థలాలకు సంబంధించిన వివరాలు వెల్లడికాలేదు.

హోఫ్‌స్టెడే ప్రాంతంలోని నివాస భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మంటలు ఎలా వ్యాపించాయనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి అదే భవనంలో నివసిస్తున్న 41 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జర్మన్‌ వార్తా సంస్థ డీపీఏ (DPA)ను ఉటంకిస్తూ ఎన్‌టీవీ (n-tv) ఈ విషయాన్ని వెల్లడించింది. నిందితుడు రొమేనియా దేశస్థుడని, హత్య అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే అగ్నిప్రమాదానికి, నిందితుడికి మధ్య సంబంధం ఏమిటి? ఈ ఘటన వెనుక ఉద్దేశపూర్వక చర్య ఏదైనా ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణ పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మృతులు భారతీయులని వెల్లడైనప్పటికీ, వారు భారత్‌లోని ఏ రాష్ట్రానికి చెందినవారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. విదేశాల్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనపై భారత అధికారులు వివరాలు సేకరిస్తున్నారా? అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.