ఇంజినీరింగ్ వ్యవస్థకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి
ఇంజినీరింగ్ నైపుణ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యం..
సాంకేతిక నిర్ణయాల్లో ఇంజినీర్లకు ప్రాధాన్యం పెంచాలి
నేడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా
ఆంధ్రప్రభ, హైదరాబాద్: దేశ మౌలిక వసతులు, సాంకేతికత, అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో ఇంజినీర్ల వృత్తికి క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోతోందని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే పేర్కొన్నారు. నేటి ఇంజినీర్లలో ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణ, అంకితభావం ఏమాత్రం తగ్గలేదని, అయితే సంస్థాగతంగా వారికి లభించాల్సిన గౌరవం, ప్రాధాన్యం తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పనుల శాఖ, నీటిపారుదల శాఖ, రైల్వేలు, రాష్ట్ర విద్యుత్ సంస్థలు వంటి విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఇంజినీర్ల సాంకేతిక సిఫారసులు తరచూ పరిపాలనా అధికారుల నిర్ణయాలకు లోబడి పోతున్నాయని తెలిపారు. సంబంధిత అంశాల్లో సాంకేతిక శిక్షణ లేదా లోతైన పరిజ్ఞానం లేని అధికారులు సైతం ఇంజినీర్ల సూచనలను తిరస్కరించడం, జాప్యం చేయడం లేదా మార్చడం జరుగుతోందని పేర్కొన్నారు. భారత ఇంజినీరింగ్ రంగానికి పితామహుడిగా గుర్తింపు పొందిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆయన జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న దేశం స్మరించుకుంటుంది. ఆనకట్టలు, జలాశయాలు, పౌర మౌలిక వసతుల నిర్మాణంలో ఆయన చేసిన కృషి శతాబ్దం దాటినా నేటికీ దేశానికి సేవలందిస్తోంది. ఆధునిక భారత నిర్మాణంలో ఇంజినీర్ల పాత్రను గుర్తించి, గౌరవించడమే ఇంజినీర్స్ డే ఉద్దేశం. అయితే ఈ రోజును కేవలం సన్మానాలు, సాంకేతిక ప్రదర్శనలకు పరిమితం చేయకుండా.. దేశ నిర్మాణంలో ఇంజినీర్లకు మరింత నిర్ణయాధికారం కల్పించాల్సిన అవసరంపై విధాన నిర్ణేతలు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని శైలేంద్ర దూబే అభిప్రాయపడ్డారు.

ఇంజినీర్లపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలి
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కేవలం ఇతరుల ఆలోచనలను అమలు చేసిన సాంకేతిక నిపుణుడు కాదని శైలేంద్ర దూబే పేర్కొన్నారు. ఆయన స్వయంగా నిర్ణయాలు తీసుకున్న దార్శనికుడు, ప్రణాళికలు రూపొందించిన నిపుణుడని గుర్తుచేశారు. చివరకు మైసూరు సంస్థానానికి దివాన్ (ప్రధానమంత్రి)గా కూడా పనిచేశారని తెలిపారు. ఇంజినీర్లకు అధికారాలు, నిర్ణయ స్వేచ్ఛ కల్పించినప్పుడు దేశాలు పటిష్ఠంగా, నాణ్యమైన మౌలిక వసతులతో నిర్మితమవుతాయని విశ్వేశ్వరయ్య వారసత్వం గుర్తుచేస్తోందన్నారు. భారతదేశ అభివృద్ధి నాణ్యతను, వేగాన్ని పెంచేందుకు ఇంజినీర్లపై విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విశ్వాసాన్ని ఇంజినీర్లకు చేసే ఉపకారంగా కాకుండా దేశానికి సంబంధించిన పెట్టుబడిగా చూడాలని సూచించారు. దేశంలోని ఇంజినీర్లు తమ నైపుణ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితులను కల్పిస్తున్నామా? లేక ఇతరులు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే సాంకేతిక సిబ్బందిగా నైపుణ్యవంతమైన తరాన్ని క్రమంగా మార్చేస్తున్నామా? అనే విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
సాంకేతిక నిర్ణయాల్లో ఇంజినీర్లకు అధికారం
బలమైన ఇంజినీరింగ్ సంస్కృతి ఉన్న జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో మౌలిక వసతుల శాఖల్లో నాయకత్వ స్థానాలకు సాంకేతిక అర్హతలు, ఇంజినీరింగ్ అనుభవానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారని శైలేంద్ర దూబే తెలిపారు. భారత్‌లో మాత్రం వంతెనల రూపకల్పన, విద్యుత్ వ్యవస్థలు వంటి రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇంజినీర్లు సైతం సాధారణ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పరిపాలనా అధికారుల నుంచి అనుమతులు పొందాల్సిన పరిస్థితి ఉందన్నారు. నీటిపారుదల, విద్యుత్, రహదారులు, పట్టణ ప్రణాళిక వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు తరచూ పరిపాలనా అధికారుల ఆమోదం అవసరమవుతోందని పేర్కొన్నారు. ప్రాజెక్టులను రూపొందించి, సాంకేతికంగా పరిశీలించిన ఇంజినీర్లు మాత్రం నిర్ణయాధికారం కలిగిన వారిగా కాకుండా కేవలం సలహాదారులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా వ్యవస్థ ప్రాధాన్యాన్ని తగ్గించాలనేది తమ ఉద్దేశం కాదని, అయితే ఇంజినీరింగ్ ఆధారిత విభాగాల్లో నెలకొన్న నిర్మాణాత్మక అసమానతలను పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
బాధ్యత ఇంజినీర్లదే.. అధికారం మాత్రం ఇతరులదా?
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో ఇంజినీర్లకు అవకాశాలు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వ సేవల్లో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని శైలేంద్ర దూబే పేర్కొన్నారు. బాధ్యతకు తగిన అధికారం లేకపోవడం వల్ల ప్రభుత్వ ఇంజినీరింగ్ సేవల్లో గతంలో ఉన్న ప్రతిష్ఠ క్రమంగా తగ్గుతోందన్నారు. ఏదైనా నిర్మాణం కూలిపోయినా, ప్రమాదం జరిగినా మొదటగా విచారణను ఎదుర్కొనేది ఇంజినీరేనని గుర్తుచేశారు. అయితే బడ్జెట్, పనుల గడువు, నిర్మాణ సామగ్రి ఎంపిక, నాణ్యతకు సంబంధించిన తుది నిర్ణయాలు ఇంజినీర్ చేతుల్లో లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అంటే అధికారానికి ప్రతీకగా ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, అయితే వంతెనలు, ఆనకట్టలు, భవనాలు, విద్యుత్ వ్యవస్థల భద్రతకు సాంకేతిక బాధ్యత వహించే ప్రధాన ఇంజినీర్‌కు అదే స్థాయి ప్రజా గుర్తింపు ఉండటం లేదని పేర్కొన్నారు. ఐఏఎస్, ఇతర పరిపాలనా సేవల ప్రాధాన్యాన్ని తగ్గించడం తమ ఉద్దేశం కాదని, విధానాల అమలులో పరిపాలనా వ్యవస్థకు ప్రత్యేక పాత్ర ఉంటుందని తెలిపారు. అదే సమయంలో ఇంజినీరింగ్ ఆధారిత విభాగాల్లో పనిచేసే సాంకేతిక నిపుణులకు ఉన్నతస్థాయి పదవులు, అవకాశాల విషయంలో కొనసాగుతున్న అసమానతలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంజినీరింగ్ నైపుణ్యంతోనే దేశాభివృద్ధి
రోడ్లు, విద్యుత్ ప్రాజెక్టులు, నీటి వ్యవస్థలు, టెలికమ్యూనికేషన్లు, రైల్వేలు, డిజిటల్ మౌలిక వసతులు దేశ భౌతిక, సాంకేతిక వెన్నెముక వంటివని శైలేంద్ర దూబే తెలిపారు. వీటి నిర్మాణం, అభివృద్ధి ఇంజినీరింగ్ నైపుణ్యంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధి వేగం మౌలిక వసతుల నాణ్యత, వాటి అమలు వేగంతో నేరుగా ముడిపడి ఉంటుందని తెలిపారు. సాంకేతిక నిర్ణయాలకు అనవసరమైన పరిపాలనా అనుమతులు, విధానపరమైన జాప్యాలు ఎదురైతే ప్రాజెక్టుల వ్యయం పెరగడంతో పాటు నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం నాణ్యతపైనా పడుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన మార్పు, హైస్పీడ్ రైళ్లు, సెమీకండక్టర్ తయారీ వంటి లక్ష్యాలను భారత్ సాధించాలంటే ఇంజినీరింగ్ నైపుణ్యానికి తగిన అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజినీర్లను కేవలం అభిప్రాయాలు చెప్పే సలహాదారులుగా కాకుండా సాంకేతిక నిర్ణయాలు తీసుకునే బాధ్యతాయుత భాగస్వాములుగా గుర్తించాలని కోరారు.
ప్రత్యేక ఇంజినీరింగ్ కమిషన్ అవసరం
వైద్య రంగానికి నేషనల్ మెడికల్ కమిషన్, చార్టర్డ్ అకౌంటెంట్లకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, న్యాయవాదులకు బార్ కౌన్సిల్ వంటి సంస్థలు ఉన్నాయని శైలేంద్ర దూబే తెలిపారు. దేశంలోని అతిపెద్ద సాంకేతిక ఉద్యోగ వర్గాల్లో ఒకటైన ఇంజినీర్లకు మాత్రం ప్రభుత్వ సేవల్లో సమగ్ర ప్రాతినిధ్యం, అధికారాలతో కూడిన జాతీయ సంస్థ లేకపోవడం బాధాకరమన్నారు. ప్రజా పనులు, రైల్వేలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, ఇతర కీలక ఇంజినీరింగ్ సేవలకు ప్రాతినిధ్యం కల్పించేలా చట్టబద్ధమైన జాతీయ ఇంజినీర్ల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశ మౌలిక వసతులకు సంబంధించిన సాంకేతిక నిర్ణయాల్లో ఇంజినీర్ల సాంకేతిక బాధ్యత, ప్రజల భద్రతకు తగిన ప్రాధాన్యం ఉండేలా ఈ కమిషన్ పనిచేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ విధానాలు, వృత్తి ప్రమాణాలను రూపొందించి, నిరంతరం అభివృద్ధి చేయాలని కోరారు. మౌలిక వసతుల విధానాలపై ప్రభుత్వానికి నేరుగా సలహాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సేవల్లోని ఇంజినీర్ల వృత్తి ప్రమాణాలు, పదోన్నతి వ్యవస్థలను రూపొందించి పరిరక్షించే బాధ్యతను కమిషన్‌కు అప్పగించాలని సూచించారు. పరిపాలనా జోక్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజినీర్లకు పరిష్కార వేదికగా కూడా ఈ కమిషన్ వ్యవహరించాలని శైలేంద్ర దూబే కోరారు.
