హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు చెక్‌.. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి రెడీ!

  • రేపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
  • రూ.620 కోట్లతో 3.2 కి.మీ. మేర నిర్మాణం..
  • పాతబస్తీ రాకపోకలకు ఊరట

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి సంతోష్‌నగర్‌ పరిధిలోని యాదగిరి థియేటర్‌ వరకు నిర్మించిన ఈ స్టీల్‌ బ్రిడ్జి ని గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు రూ.620 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌, సంతోష్‌నగర్‌, నల్గొండ ఎక్స్‌రోడ్‌ పరిసరాల్లో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్‌ సమస్యలకు కొంతమేర ఉపశమనం లభించనుంది.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ స్టీల్‌ బ్రిడ్జి సుమారు 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. నాలుగు లేన్లుగా నిర్మించిన ఈ వంతెన చంచల్‌గూడ, సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ మీదుగా సంతోష్‌నగర్‌ వైపు రాకపోకలను సులభతరం చేయనుంది. నిర్మాణ పనులు వివిధ కారణాలతో ఆలస్యమైనప్పటికీ.. పనులు పూర్తిచేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సైదాబాద్‌ జంక్షన్‌, ఐఎస్‌ సదన్‌ ప్రాంతాల్లో రద్దీ కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా చార్మినార్‌, పాతబస్తీ వైపు నుంచి సంతోష్‌నగర్‌, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లే వాహనాలు తరచూ ట్రాఫిక్‌లో చిక్కుకుంటాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

వాహనదారుల రాకపోకలకు అనుగుణంగా వంతెనకు అవసరమైన ర్యాంపులను కూడా ఏర్పాటు చేశారు. ఐఎస్‌ సదన్‌ వైపు నుంచి నల్గొండ ఎక్స్‌రోడ్‌ దిశగా వెళ్లే వాహనాలకు అప్‌ ర్యాంప్‌, మరోవైపు వెళ్లే వాహనాలకు డౌన్‌ ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన రహదారిపై సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచే పరిస్థితి తగ్గే అవకాశం ఉంది. నల్గొండ ఎక్స్‌రోడ్‌ నుంచి ఓవైసీ జంక్షన్‌ వరకు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే పాతబస్తీ, దక్షిణ హైదరాబాద్‌ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, చంచల్‌గూడ, ఐఎస్‌ సదన్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గడంతో పాటు వాహనాలు నిలిచే సమయం తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రయాణ సమయం, ఇంధన వినియోగం తగ్గడంతో పాటు వాయు కాలుష్యాన్ని కూడా కొంతమేర నియంత్రించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వంతెనను ప్రారంభించనున్నారు. అనంతరం చంచల్‌గూడ జూనియర్‌ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.