శిథిలావస్థలో సింగిల్ బ్రిడ్జి..

శిథిలావస్థలో సింగిల్ బ్రిడ్జి..

మోత్కూర్, (ఆంధ్రప్రభ)
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని మోత్కూర్ – గుండాల రోడ్డులో బిక్కేరు వాగు పై గత 35 సంవత్సరాల క్రితం నిర్మించిన లో లెవెల్ సింగిల్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు, వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సులు, డీసీఎంలు, లారీలు, ట్రాక్టర్లు, ఇతర పెద్ద వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒకటే వాహనం వెళ్లే పరిస్థితి ఈ బ్రిడ్జిపై ఉంది. దీంతో బ్రిడ్జికి ఓపక్క పెద్దవాహనం కనిపించగానే… అవతలి పక్క ఇతర వాహనాలు నిలుపుకోవాల్సి వస్తుంది. ఆ పెద్ద వాహనం వెళ్లిన తర్వాతే తిరిగి ఈ వాహనాలు వెళుతున్నాయి. రాత్రి వేళల్లో చీకట్లో ఈ బ్రిడ్జి పై ప్రయాణం నల్లేరు పై నడకగా మారింది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గత ఎన్నికల్లో మోత్కూర్ – గుండాల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇటీవల ఆయా సమావేశాల్లో ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపన చేస్తామని ఎమ్మెల్యే సామెల్ చెబుతున్నారు. తప్పా రెండేళ్లు గడుస్తున్నా కనీసం శంకుస్థాపన కాకపోవడంతో మున్సిపల్ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రూట్లో జనగామ మీదుగా హన్మకొండకి షార్ట్ కట్ కావడంతో పాటు గుండాల మండలంలోని 20 గ్రామాలకు చెందిన ప్రజలు చాలా మంది ప్రయాణికులు ఈ రూట్లో వెళ్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సామెల్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకశ్రద్ధ తీసుకొని హై లెవెల్ డబల్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేసి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.

Leave a Reply