రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ.. ఫలితాలపై మస్క్‌ సెటైరికల్‌ పోస్ట్‌

  • రిపబ్లికన్ల ఓటమిపై మస్క్‌ వ్యంగ్యాస్త్రం..
  • ‘నా స్పేస్‌ లేజర్లు పనిచేయలేదేమో!’
  • టెక్సాస్‌లో కీలక ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం..
  • రిపబ్లికన్‌ అభ్యర్థులకు దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా మస్క్‌ విరాళాలు
  • అంతరిక్షంలో డేటా సెంటర్లు ఆకర్షణీయంగా ఉన్నాయంటూ మరో పోస్ట్‌

వాషింగ్టన్‌, ఆంధ్రప్రభ :

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన భారీ ఓటమిపై బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. టెక్సాస్‌తో పాటు దేశవ్యాప్తంగా డెమోక్రాట్లు కీలక విజయాలు సాధించడంతో.. “ఈసారి ఎన్నికల్లో జోక్యం చేసుకునే నా అంతరిక్ష లేజర్లు పనిచేయలేదనుకుంటా” అంటూ తన సొంత సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థులకు మస్క్‌ భారీగా నిధులు ఖర్చు చేశారు. అయినప్పటికీ టెక్సాస్‌లో కీలక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. రిపబ్లికన్‌ సెనేట్‌ అభ్యర్థి కెన్‌ పాక్స్టన్‌ను డెమోక్రటిక్‌ అభ్యర్థి జేమ్స్‌ తలారికో ఓడించారు. రాష్ట్ర గవర్నర్‌ ఎన్నికల్లోనూ డెమోక్రటిక్‌ అభ్యర్థి గినా హినోజోసా విజయం సాధించి, గ్రెగ్‌ అబాట్‌ ఆధిపత్యానికి తెరదించారు.

దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ఖర్చు…

2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థులకు మస్క్‌ దాదాపు 474 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4,000 కోట్లకు పైగా) ఖర్చు చేసినట్లు ఎన్నికల విరాళాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా రాజకీయాల్లో ఒకే ఎన్నికల చక్రంలో వ్యక్తిగతంగా అత్యధికంగా నిధులు ఖర్చు చేసిన వారిలో ఆయన ముందున్నారు.

మస్క్‌ విరాళాల్లో అధిక భాగం ఆయనకు చెందిన అమెరికా పీఏసీ, రిపబ్లికన్లకు మద్దతుగా పనిచేసే సెనేట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌, కాంగ్రెస్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌ వంటి రాజకీయ సంస్థలకు వెళ్లాయి. సెప్టెంబరులోనే సెనేట్‌ లీడర్‌షిప్‌ ఫండ్‌కు 158 మిలియన్‌ డాలర్లు అందించారు. ఈ నిధుల్లో గణనీయమైన భాగం టెక్సాస్‌ సెనేట్‌ అభ్యర్థి కెన్‌ పాక్స్టన్‌ ప్రచారానికి వినియోగించారు.

అయితే భారీ ఆర్థిక మద్దతు ఉన్నప్పటికీ పాక్స్టన్‌ ఓటమి పాలయ్యారు. తలారికో విజయ ప్రసంగంలో ధనిక, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులను ప్రస్తావించారు. “ఈ ఎన్నికల్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి, అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి, వాషింగ్టన్‌ రాజకీయ వ్యవస్థ మొత్తం మాకు ఎదురయ్యాయి” అని వ్యాఖ్యానించారు.

అంతరిక్షంలో డేటా సెంటర్లపై మరో పోస్ట్‌..

టెక్సాస్‌లో గవర్నర్‌, సెనేట్‌ ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయాలు మస్క్‌కు రాజకీయంగానే కాకుండా వ్యాపార పరంగానూ ప్రాధాన్యం కలిగినవి. ఆయనకు చెందిన టెస్లా, స్పేస్‌ఎక్స్‌, ఎక్స్‌ సంస్థల ప్రధాన కార్యాలయాలు టెక్సాస్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో కృత్రిమ మేధ ఆధారిత డేటా సెంటర్ల నిర్మాణం, వాటి విద్యుత్‌, నీటి వినియోగంపై ఎన్నికల ప్రచారంలో చర్చ జరిగింది.

డేటా సెంటర్ల నిర్మాణంపై కఠిన నియంత్రణలు ఉండాలని తలారికో ప్రచారం చేయగా.. కొత్త ప్రాజెక్టులపై తాత్కాలిక నిషేధం విధించాలని గినా హినోజోసా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మస్క్‌ “అంతరిక్షంలో డేటా సెంటర్లు ఇప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి” అంటూ మరో పోస్ట్‌ చేశారు.

దేశవ్యాప్తంగా కూడా డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్‌లలో ఆధిపత్యం సాధించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీకి ఈ ఫలితాలు రాజకీయ ఎదురుదెబ్బగా మారాయి. ఎన్నికల్లో భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయలేకపోయిన మస్క్‌.. తన స్పందనను వ్యంగ్య వ్యాఖ్యలకే పరిమితం చేశారు.