టిబెట్–నేపాల్ సరిహద్దులో వరుస భూకంపాలు..
- వరదల తర్వాత వరుస భూకంపాలు..
- టిబెట్–నేపాల్‌లో టెన్షన్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నేపాల్-టిబెట్ ప్రాంతంలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి టిబెట్‌లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 35 కిలోమీటర్ల లోతులో నమోదైనట్టు యూరోపియన్-మెడిటరేనియన్ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది.
టిబెట్‌లో భూకంప ప్రకంపనలు సంభవించిన కొద్ది గంటలకే నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత 5.0గా నమోదైందని, ఇది రాత్రి 9:38 గంటలకు సంభవించిందని జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఈ వరుస ప్రకంపనలు టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి.
మరోవైపు.. గత గురువారం (సెప్టెంబర్ 3న) కూడా టిబెట్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు 10 కిలోమీటర్ల లోతులో నమోదయ్యాయని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
వరదల బీభత్సం.. ఇప్పుడు భూకంపాలు
ఇప్పటికే భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరుస భూకంపాలు కొత్త ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు-రాళ్ల భారీ కొండచరియ విరిగిపడటంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. భోటెకోషి నదిలో భారీగా నీరు, బురద, శిథిలాలు కొట్టుకురావడంతో ఉత్తర, మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. మంగళవారం నాటికి వరదల్లో మృతుల సంఖ్య 1,357కి చేరిందని.. మరో 5,326 మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇప్పటివరకు 13,583 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
చైనాలోనూ భారీ నష్టం
ఈ వరదల ప్రభావం టిబెట్‌పై కూడా తీవ్రంగా పడింది. చైనా వైపు కనీసం 43 మంది మరణించగా, 500 మందికి పైగా గల్లంతయ్యారని చైనా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేగంగా కరుగుతున్న హిమానీనదాలు, క్వింగ్‌హై-టిబెట్ పీఠభూమిలోని స్థానిక భౌగోళిక పరిస్థితులే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాయని చైనా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టిబెట్ అటానమస్ రీజియన్‌లో సుమారు 33,000 హిమానీనదాలు ఉన్నాయని, వాటిలో 187 అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించినట్లు చైనా అధికారులు వెల్లడించారు. హిమానీనదాలు కరుగుతుండటంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్రహ్మపుత్ర నదితో సహా సుమారు పది అంతర్జాతీయ నదులు క్వింగ్‌హై-టిబెట్ పీఠభూమి గుండా ప్రవహిస్తాయి. ఈ ప్రాంతంలోని హిమానీనదాలలో మార్పులు, నదీ ప్రవాహాలలో హెచ్చుతగ్గులు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు భారతదేశంతో సహా దిగువ ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
