ఆస్తి కోసమేనా!?
మోరగుడిలో జంటహత్యల కలకలం
ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీవెంకటేశ్వరరావు
పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
జమ్మలమడుగు అక్టోబర్ 26 (ఆంధ్రప్రభ):– కడప జిల్లా జమ్మలమడుగు మండలం మొరగుడిలో జంట హత్యలు జరిగిన ఘటన స్థలాన్నిఆదివారం డీఎస్పీవెంకటేశ్వరరావు, అర్బన్ సీఐ నరేష్ బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇటుకల బట్టిలో నిద్రిస్తున్న ఇద్దరు దంపతులను తలలు పగలగొట్టి హత్య చేసిన ఘటనపై ఆరా తీశారు. జంటల హత్యలకు పాల్పడిన దుండగులు ఎవరు? ఇటుకల బట్టిలో కాపలాగా ఉన్న నాగప్ప (60) పెద్దక్క(53) ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆస్తి కోసమే ఘాతుకానికి పాల్పడ్డారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
చెల్లాచెదురైన వస్తువులు
నాగప్ప (60) పెద్దక్క(53) నడుపుతున్న ఇటుకల బట్టిలో నిద్రిస్తుండగా రోకలి బండతో మోది చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పక్కనే ఉన్న గదిలో పగలగొట్టిన బీరువా, చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నాగప్పకు గతంలో ఓబులమ్మతో వివాహం కాగా వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తర్వాత పెద్ద భార్య అంగీకారంతోనే పెద్దక్కతో సుమారు 30 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తాడిపత్రి రహదారిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని ఇటుకల బట్టి నడుపుతున్నారు. పెద్ద పసుపుల మోటు లో స్థలాన్ని లీజుకు తీసుకొని మరొక ఇటుకల బట్టిని నడుపుతున్నారు.

