ప్రకృతికి ప్రణామం.. జనసేనానికి జన్మదిన వందనం
వినూత్నంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ద్వారకాతిరుమల, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గోపాలపురం నియోజకవర్గ మహిళా నేత దిరిశిన ఫాతిమారాణి ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకృతికి ప్రణామం.. జనసేనానికి జన్మదిన వందనం” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఆయనకు ప్రకృతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ద్వారకాతిరుమలలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ నక్షత్ర వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఫాతిమారాణి పనస చెట్టును నాటి, పూజలు చేశారు అలాగే పవన్ కళ్యాణ్ 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారికి 55 కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఫాతిమారాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ప్రకృతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
