కిష్టాపూర్ హెచ్‌ఎంకు అరుదైన గౌరవం..
- సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పురస్కారం..
- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్నకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అరుదైన గౌరవం దక్కింది. కొడంగల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రం, నగదు పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆయనను అభినందించారు.
గుండ రాజన్న 2023 సెప్టెంబర్ నుంచి కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ ఉపకార వేతనాలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.
తన పర్యవేక్షణలో 12 మంది విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు రాజన్న తెలిపారు. అలాగే బాసర ట్రిపుల్‌ఐటీలోనూ ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 582 మార్కులు సాధించిన విద్యార్థి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన వారిలో నిలిచారని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాఠశాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు అవార్డులు లభించాయని రాజన్న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ గుర్తింపు తనకు మరింత బాధ్యతను పెంచిందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వాసాల నరేష్, మండల విద్యాధికారి బానావత్ రాజేందర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మంగ, సీనియర్ ఉపాధ్యాయులు మురళి, కమలాకర్, ప్రకాష్, బానావత్, ఉపాధ్యాయ బృందం తదితరులు గుండ రాజన్నను అభినందించారు.
