APL ఆరంభ మ్యాచ్‌లో ప‌రుగుల‌ వర్షం…

APL ఆరంభ మ్యాచ్‌లో ప‌రుగుల‌ వర్షం…

  • కాకినాడ కింగ్స్ భారీ స్కోర్ 219/5
  • విశాఖపట్నంలో ఉత్కంఠభరిత ఐ పీ ఎల్ ప్రారంభం
  • టాస్ గెలిచిన వైజాగ్ లయన్స్ ఫీల్డింగ్ ఎంపిక

ఆంధ్రప్రభ, విశాఖపట్నం : విశాఖపట్నంలో జరుగుతున్న ఏపీఎల్ సీజన్–5 తొలి మ్యాచ్‌లో క్రికెట్ అభిమానులను ఆకట్టుకునే స్థాయిలో ఉత్కంఠభరిత ప్రారంభం నమోదైంది. సింహాద్రి వైజాగ్ లయన్స్ మరియు కాకినాడ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు సమక్షంలో నిర్వహించగా, హోమ్ టీం సింహాద్రి వైజాగ్ లయన్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.

కాకినాడ కింగ్స్ బ్యాటింగ్ దూకుడు..

ముందుగా బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్యాటర్లు, పవర్‌ప్లే నుంచే రన్‌రేటును పెంచుతూ వైజాగ్ లయన్స్ బౌలింగ్ దళంపై ఒత్తిడి తీసుకొచ్చారు. చివరికి జట్టు స్కోర్ 200 మార్క్‌ను దాటుతూ గణనీయమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాకినాడ కింగ్స్ తరఫున ఎం. యువన్ 34 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 2 ఫోర్లు, 6 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. చివరి ఓవర్లలో లకాజ్ రెడ్డి కేవలం 7 బంతుల్లో 23 పరుగులు చేసి వేగాన్ని మరింత పెంచాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదు కావడం విశేషం.

వైజాగ్ లయన్స్ విశేష బౌలింగ్..

వైజాగ్ లయన్స్ బౌలింగ్ విభాగంలో గిరినాధ్ రెడ్డి, ఢిల్లీ గణేష్, వినయ్ కుమార్, త్రిపురాన విజయ్ తలో వికెట్ సాధించారు. అయితే భారీ స్కోర్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా విజయవంతం కాకపోవడంతో ప్రత్యర్థి జట్టు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇప్పుడు వైజాగ్ లయన్స్ విజయానికి 220 పరుగులు అవసరం కాగా, రెండో ఇన్నింగ్స్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply