మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం ఏర్పాటు చేయాలి

మహేశ్వరం, ఆంధ్రప్రభ: మహేశ్వరం నియోజకవర్గానికి కేటాయించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అక్కడ సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజీకి సొంత భవనం, మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ విద్యార్థులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి హరీశ్‌రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీకి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.