ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలి..

గోదావరిఖని, ఆంధ్రప్రభ: సింగరేణి బొగ్గు పరిశ్రమలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికుల కోసం ప్రతి నెలా మెడికల్‌ బోర్డు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం రామగుండం ఏరియా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల వద్ద సంఘం ప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీబీజీకేఎస్‌ రామగుండం ఏరియా ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అనర్హులుగా కాకుండా వైద్య పరీక్షల ఆధారంగా అన్ఫిట్‌గా ప్రకటించి, వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గుర్తింపు ఎన్నికల సమయంలో ప్రతి నెలా మూడు మెడికల్‌ బోర్డులు నిర్వహిస్తామని ఇచ్చిన హామీని సంబంధిత సంఘాలు విస్మరించాయని ఆరోపించారు. మెడికల్‌ బోర్డుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి నెలా మెడికల్‌ బోర్డులు నిర్వహించి, అర్హులైన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అనంతరం సంబంధిత అధికారులకు నాయకులు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కొమురయ్య, రవి, రాజేశం, శేషగిరి, అంజయ్య, మురళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.