బతికున్నభర్తకు ఓటు లేదు.. మరణించిన అత్తకు మాత్రం ఉంది!

30 ఏళ్లుగా ఓటు వేస్తున్నా ఈసారి జాబితాలో గల్లంతైన పేరు
ఓటరు జాబితాలో విచిత్ర పరిస్థితి.. లక్ష్మీదేవి ఆవేదన
కర్నూలు రూరల్‌ బ్యూరో, ఆంధ్రప్రభ:
ఓటరు జాబితాలో అధికారుల నిర్లక్ష్యమో.. సాంకేతిక తప్పిదమో తెలియదు కానీ, గత 30 ఏళ్లుగా ప్రతి ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓ వ్యక్తి పేరు ఈసారి జాబితాలో గల్లంతైంది. మరోవైపు ఎనిమిదేళ్ల క్రితమే మరణించిన ఆయన అత్త పేరు మాత్రం ఓటరు జాబితాలో కొనసాగుతుండటం విస్మయం కలిగిస్తోంది.

ఈ విచిత్ర పరిస్థితి కర్నూలు మండల పరిధిలోని నందనపల్లి గ్రామం లక్ష్మీనగర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మీనగర్‌కు చెందిన వెంకట రామగౌడు గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికలో ఓటు వేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఓటు హక్కు లేకుండా పోయింది. ఆయన భార్య లక్ష్మీదేవి, కుమారుడి పేర్లు ఓటరు జాబితాలో ఉండగా, ఎనిమిదేళ్ల క్రితం మరణించిన అత్త పేరు సైతం జాబితాలో నమోదై ఉంది. కానీ బతికున్న తన భర్త పేరు మాత్రం గల్లంతైందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన భర్త పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా, ఓటరు జాబితాలో పేరు లేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందని తెలిపారు. మూడు దశాబ్దాలుగా ఓటు వేస్తున్న వ్యక్తి పేరు తొలగిపోయి, మరణించిన వ్యక్తి పేరు కొనసాగుతుండటం అధికారుల పనితీరుకు నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో జరిగిన ఈ పొరపాటుపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, తప్పులను సరిదిద్దాలని లక్ష్మీదేవి కోరారు. తన భర్తకు తిరిగి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.