ఏటూరునాగారంలో జూనియర్‌ కోర్టు ఏర్పాటు చేయాలి

ములుగు జిల్లాకు మంజూరైన కోర్టును ఏటూరునాగారంలో నెలకొల్పాలని వినతి
హైకోర్టు న్యాయమూర్తులను కలిసి వినతిపత్రం అందజేసిన కోర్టు సాధన సమితి
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ:
ములుగు జిల్లాకు మంజూరైన నూతన జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టును ఏటూరునాగారంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఏటూరునాగారం తాలూకా కోర్టు సాధన సమితి సభ్యులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం అందజేశారు.
హైకోర్టు పోర్ట్‌ఫోలియో న్యాయమూర్తి జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్‌ భీమపాక నగేష్‌, జస్టిస్‌ కాజా శరత్‌లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం ఏటూరునాగారంలో నూతన కోర్టును ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కోర్టు సాధన సమితి అధ్యక్షుడు దాగం ఆదినారాయణ, సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలాచారి, ఉపాధ్యక్షుడు ప్రణయ్‌ ప్రసాద్‌, కమిటీ సభ్యులు ఏలూరి రవిప్రసాద్‌ రెడ్డి, పూర్ణచందర్‌రావు, నారపోగు రాంబాబు, కిరణ్‌కుమార్‌ వర్మ, సీతారామ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.