భారీ కుంభకోణం…

అన్నాతమ్ముళ్లు ఆఫీస్‌లు బయటపెట్టి వసూళ్లకు పాల్పడుతోండ్లు
ఐటీ మంత్రి పేషీలో జరిగిన స్కాంపై ఎంక్వైరీ కమిటి వేయాలే
ఇంత పెద్ద స్కాంపై మీడియా స్పందించకపోవడం బాధాకరం
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌


వెబ్ డెస్క్, హైదరాబాద్ : సెక్రటేరియట్‌ వేదికగానే భారీ కుంభకోణం జరిగిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) అన్నారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఐటీ మంత్రి పేషీలో జరిగిన స్కాం విషయంలో కళ్యాణ్‌రాజ్‌ ఎపిసోడ్‌ గత నెల 9న బయటకు వస్తే ఈ నెల 8న కేసు నమోదు చేసి ఆ కేసును సీసీఎస్‌కు బదిలి చేసినట్లు చెబుతున్నారన్నారు. కేవలం రఘురాంశర్మ దుద్దిళ్ల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతోనే ఇంత పెద్ద కుంభకోణాన్ని సాధారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది పాత విషయమే కొత్తది కాదంటూ రఘురాంశర్మ ప్రకటన చేశారని, రెండు నెలల క్రితం జరిగితే పాతదా అని ఆయన ప్రశ్నించారు.

అయితే రఘురాం శర్మ (Raghuram Sharma) చెప్పిన తేదీలో ఏ ఒక్క ఎఫ్‌ఐఆర్‌ లేదని, జూన్‌ 3న దరఖాస్తు ఇచ్చిన చెబుతున్నారని, కానీ ఆ తేదిన అసలు ఎఫ్‌ఐఆర్‌ లేదని ఆయన వివరించారు. మంత్రి పేషీ అడ్డాగా కుంభకోణం నడుస్తుందని కళ్యాణ్‌రాజ్‌ ఇచ్చిన దరఖాస్తులో స్పష్టంగా ఉందన్నారు. ఈ కేసలు నిందితులుగా గుర్తించిన వారికి మంత్రి వాహన పాస్‌లు ఉన్నాయని, వారంతా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వెళ్లి వచ్చేలా వాహనాలకు పాస్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా పత్రికలు మంత్రిపై ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.కొంతమంది అయితే అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఆఫీస్‌లు తెరిచి ఉంటాయని పని చేస్తారంటూ కీర్తిస్తున్నారని, కానీ అసలు ఆఫీస్‌లు దందాలకు అడ్డాగా మారిపోయాయని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్ (Hyderabad) లో వివిధ‌ కంపెనీల పేరుతో నాలుగు ఆఫీస్‌లు పెట్టి ఆ ఆఫీస్‌ల వసూళ్లను సెక్రటియేట్‌ వేదికగా నడిపిస్తున్నారనే విషయాన్ని సమాజం గమనించాలన్నారు. అన్నతమ్ముళ్లు ఆఫీస్‌లు బయటపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. మంత్రులు కొండ సురేఖ, సీతక పీఏలపై అనేక ప్రచారాలు చేశారని, కొండ సురేఖ పీఏ ఎవరిపై గన్‌ పెట్టిండో ఎవరికి తెలియదని, సీతక్క పీఏ ఇసుక కుంభకోణమంటూ రాద్దాంతం చేశారన్నారు., ఎస్సీ ఎస్టీ బీసీలపై ఇంత దాడులు జరుగుతున్నా షోకాల్డ్‌ గొప్పవాడిలా చెలామణి అవుతున్న దుద్దిళ్ల శ్రీధర్‌ మీద ప్రభుత్వానికి , సమాజానికి ఎందుకు ఇంత ప్రేమనో చెప్పాలన్నారు. మంత్రి సోదరుడు శ్రీను సైతం అన్ని జిల్లాల్లో అనేక విషయాల్లో ఎంటరై కుంభకోణాలకు పాల్పడుతున్నాడని, ఐటీ కంపెనీ, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో మోసం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలో గతంలో కలెక్టర్‌ నీతు ప్రసాద్‌ వారధి ద్వారా నిరుద్యోగుల మెరిట్‌, కాస్ట్‌ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే వారని, కానీ ఈనాడు వారధిని తొలగించి ఓ కంపెనీ ద్వారా ఉద్యోగాలు రూ.5లక్షలకు అమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. రామగుండం మెడికల్‌ కాలేజీలో పని చేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తొలగించి అక్కడ అలైన్‌ సెక్యూరిటీ మ్యాన్‌ పవర్‌ సర్వీసెస్‌ అనే కంపెనినీ ఎంప్యానల్‌ చేసి వంద మందికి పైగా ఐదు లక్షల చొప్పున తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఒక్క కరీంనగర్‌ కాకుండా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలతో పాటు అనేక జిల్లాలో మంత్రి సోదరుడు బినామీ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నారన్నారు.

మంత్రి సోదరుడు మంథనికి వస్తే అక్కడ ఓ మాజీ వార్డు సభ్యులు వసూళ్లకు పాల్పడి ఆ డబ్బులతో పూలదండలతో సన్మానాలు చేస్తున్నారని, బారీగా వాహనాలతో కాన్వాయ్‌లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. చీకటి వ్యాపారాలు చిన్న చిన్న పత్రికల్లో రావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించి ఎవరికి లంచాలు ఇవ్వవద్దని ప్రకటన చేశారని ఆయన తెలిపారు. మంత్రి పేషీలో జరిగిన కుంభకోణంపై మంత్రి ఎలాంటి ప్రకటన చేయకపోవడం, ప్రభుత్వం ఖండించలేదంటే పెద్ద కుంభకోణం జరిగిందని అనుమానించాల్సిన అవసరం ఉందని, వెంటనే ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటి వేసి విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే సమాజంలో నాలుగో స్థంభంగా పేరున్న పత్రికలు ఈ వ్యవహరంపై నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.

Leave a Reply