శ్రీచరణికి భారీ నజరానా..

- గ్రూప్ వన్ ఉద్యోగం..
- ఇంటి స్థలం.. రూ.2.5 కోట్ల బహుమతి
- ఏపీ సీఎం చంద్రబాబు హామీ
ఆంధ్రప్రభ, అమరావతి ప్రతినిధి : మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం కెప్టెన్ శ్రీచరణి కి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం, రూ.2.5 కోట్ల నగదు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శ్రీచరణి, వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఈరోజు ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబును కలిశారు. శ్రీచరణిని సీఎం చంద్రబాబు అభినందించారు. విమానాశ్రయంలో ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని ఘనస్వాగతం పలికారు.
మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఏ.సి. ఏ ఆధ్వర్యంలో మహిళ క్రికెటర్ శ్రీ చరణి మీడియాతో మాట్లాడుతూ, ఏసీఏ తనకు అన్ని విధాలుగా తోడుగా నిలిచిందన్నారు. మరింత ముందుకు ఎలా వెళ్ళాలనే విషయాన్ని ప్రధాని మోదీ తెలిపినట్టు శ్రీచరణి వివరించారు. సీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మద్దతు మరువలేనిదన్నారు.
ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, సీఎంను కలిసినప్పుడు శ్రీ చరణి కి క్రికెట్ పై మరింత దృష్టి పెట్టాలని చెప్పారని, ఏసీఏ తరపున అన్ని సదుపాయాలు ఆటగాళ్లకు కల్పిస్తున్నామన్నారు. విశాఖ స్టేడియంలో ఒక వింగ్ కు శ్రీ చరణి పేరుని పెడుతున్నట్టు తెలిపారు. త్వరలోనే మహిళా క్రికెటర్ అకాడమి త్వరలో ప్రారంభిస్తామని, మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అవార్డ్స్ కూడా ఇస్తామన్నారు.
