కనకదుర్గమ్మకు కానుకల వెల్లువ..

  • 14 రోజుల్లో రూ.2.60 కోట్లకు పైగా కానుకలు..
  • 186 గ్రాముల బంగారం, 2.605 కిలోల వెండి బహూకరణ
  • విదేశీ డాలర్లు బహుకరించిన భక్తులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు బుధవారం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో దేవస్థానానికి సంబంధించిన హుండీలను ఈవో వి.కె. శీనా నాయక్ పర్యవేక్షణలో అధికారులు, ఏఈవోలు, ఎస్పీఎఫ్, స్థానిక పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది కలిసి లెక్కించారు.

14 రోజుల్లో రూ.2.60 కోట్లు..

సెప్టెంబరు 23న చివరిసారిగా హుండీలను లెక్కించగా.. అక్టోబరు 7న జరిగిన లెక్కింపుతో మొత్తం 14 రోజుల వ్యవధిలో భక్తులు హుండీల్లో రూ.2,60,73,491 నగదును సమర్పించారు. ఇందులో భారతీయ కరెన్సీ నోట్లు రూ.2,49,93,491, నాణేలు రూ.10,80,000 ఉన్నాయి. ఈ లెక్కన రోజుకు సగటున రూ.18,62,392.21 చొప్పున హుండీ ఆదాయం వచ్చింది. భక్తులు కానుకల్లో 186 గ్రాముల బంగారం, 2 కిలోల 605 గ్రాముల వెండి లభించింది. భక్తి కానుకల్లో దేశీయ కరెన్సీతో పాటు విదేశీ కరెన్సీలు కూడా ఉన్నాయి.

అమెరికా డాలర్లు 435, మలేషియా రింగిట్ 3, యూఏఈ దిర్హమ్స్ 280, భూటాన్ న్గుల్ట్రం 50, యూరో 50, ఇంగ్లాండ్ పౌండ్లు 25, టాంజానియా షిల్లింగ్ 1,000, వియత్నాం డాంగ్ 10,000, ఖతార్ రియాల్ 36, ఒమన్ బైసా 400, కెనడా డాలర్లు 120, ఆస్ట్రేలియా డాలర్లు 560, సింగపూర్ డాలర్లు 52, న్యూజిలాండ్ డాలర్లు 45, జపాన్ యెన్ 1,000, మాల్దీవుల రుఫియా 20, కువైట్ దినార్ 0.8, నైజీరియా నైరా 500 లభించాయి. హుండీ లెక్కింపులో పాత కరెన్సీ నోట్లు కూడా బయటపడ్డాయి. రూ.2,000 విలువైన 9 నోట్లు లభించయి. హుండీ లెక్కింపు ప్రక్రియను దేవస్థాన అధికారులు పర్యవేక్షిస్తూ, భద్రతా సిబ్బంది సమక్షంలో పూర్తి చేశారు.