ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. గురువారం సచివాలయంలో జరిగిన ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సమీక్షా సమావేశంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.

గ్రామ స్థాయిలో సేకరించిన సమాచారంతో ప్రతి కుటుంబం అవసరాలను గుర్తించి, సంక్షేమ పథకాలను నేరుగా, వేగంగా పొందేలా ఒక వ్యవస్థను రూపొందించాలని ఆయన అన్నారు. ఆధార్‌ కార్డు తరహాలో ఉండే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా.. ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం, ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఈ వివరాలను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉండాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ పథకాల కారణంగా కుటుంబాలు విడిపోవడం వంటి పరిస్థితులు రాకూడదని… అందరికీ సమానంగా లబ్ధి చేకూరేలా అవసరమైతే పథకాలను రీ-డిజైన్ చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో త్వరలోనే పాపులేషన్ పాలసీ ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంగా అమలు చేస్తూ ప్రజల మేలుకోసం విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుంటుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply