పెళ్లి కావాలన్న బాలుడు.. తల్లిదండ్రులు వద్దనడంతో… !
శృంగవరపుకోట, ఆంధ్రప్రభ : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చీడిపాలెం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరిన ఓ మైనర్ బాలుడు.. వారు అందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. చీడిపాలెం గ్రామానికి చెందిన నాగ మణికంఠ (16) ఇంటర్మీడియట్ ఒకేషనల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెతో తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కోరినట్లు సమాచారం.
అయితే మణికంఠ ఇంకా మైనర్ అని, పెళ్లికి చాలా సమయం ఉందని తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టాలని, పెళ్లి గురించి ఆలోచించేందుకు ఇంకా సమయం ఉందని హితవు పలికినట్లు తెలుస్తోంది. అయితే తల్లిదండ్రుల మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన మణికంఠ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని చూసేసరికి బాలుడు ఉరివేసుకుని ఉండటంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. మైనర్ వయసులో ప్రేమ, పెళ్లి అంశంపై తల్లిదండ్రులతో జరిగిన చర్చ అనంతరం బాలుడు ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
