నాగర్‌కర్నూల్‌లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి వినతి
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ :
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి, బీసీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ అందించాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన బీసీ విద్యార్థులు అధిక సంఖ్యలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ కోచింగ్ కేంద్రం లేకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

స్టడీ సర్కిల్ ఏర్పాటుకు జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న భవనంలో సుమారు 4 వేల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. ఇందులో రెండు స్టడీ హాళ్లు, నాలుగు గదులు, మరుగుదొడ్లు, విద్యుత్, నీరు, ఇంటర్నెట్ సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. శాశ్వత భవనం నిర్మించే వరకు ఇక్కడే తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.