- రైతులంటే అధికారులకు అంతా అలుసా?..
- ఉదయం 11 గంటలకైనా దాని అధికారులు…
- ఆంధ్రప్రభ లో వచ్చిన కథనానికి స్పందన…
నంద్యాల బ్యూరో, మార్చి 5 : నంద్యాల జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టు కింద పంటలు వేసిన రైతుల పరిస్థితి ఆందోళనకరమని కేసీ కెనాల్ కాల్వకు నీరందించలేమని అధికారులు బాహాటంగా పేర్కొనడంతో ఆంధ్రప్రభ లో బుధవారం ఓ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన రైతులతో పాటు రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు భారీ సంఖ్యలో జిల్లా కేంద్రంలో ఉన్న నీటి పారుదల కార్యాలయానికి బుధవారం చేరుకున్నారు. రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
వారి ఆవేశం కట్టలు తెగుతుంది. రైతులు అధిక సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఉదయం 11 గంటల సమయం దాటినా నీటిపారుదల శాఖ అధికారులు కార్యాలయానికి రాకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. కేసీ కాలువ కింద సుమారు 25వేల హెక్టార్ల పంటలు సాగవుతున్నాయి. కేసీ కెనాల్ ఆయకట్టు కింద గోస్పాడు, నంద్యాల, సిరివెళ్ల, బండి ఆత్మకూరు, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం వంటి మండలాల్లో వరి పంటతో పాటు కంది, మిరప అరుతడి పంటలు సాగు చేస్తున్నారు. పంట వేసిన సమయంలో ఇంకా రెండు తడులు నీరు పారిస్తే పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు సుమారుగా 50వేల రూపాయల నుంచి 60వేల పెట్టుబడి పెట్టారు. అంతా చేతికొచ్చే సమయంలో అధికారులు ఇలా సాగునీటిని ఆపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు అంటే ఆ అధికారులకు అంత అలుసా… అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగునీటి సమస్య కోసం రైతులు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఇలా సాగునీటిని నిలుపుదల చేయాల్సి వస్తుందని పేర్కొనడం విశేషం. వేల ఎకరాల్లో పంటనష్టం జరుగుతుందని, ఏప్రిల్ చివరి వరకు నీటిని అందిస్తే పంటలు చేతికి వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా పడినా రైతులకు సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ రైతుల సాగునీటి కోసం పట్టించుకునే నాథుడే కరువయ్యారని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా ప్రతినిధులు రైతుల సమస్యలను తీవ్రంగా పరిగణించి రైతులకు సాగునీరందించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.
