Traffic Rules | మైనర్ల డ్రైవింగ్ ప్రాణాంతకం…

Traffic Rules | మైనర్ల డ్రైవింగ్ ప్రాణాంతకం…

  • యాదాద్రి జిల్లా రవాణా అధికారి ఆనంద్ శ్యామ్ ప్రసాద్

Traffic Rules | మోత్కూర్, ఆంధ్రప్రభ : మైనర్ పిల్లలు వాహనాలు నడపడం ప్రాణాంతకం అని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించాలని జిల్లా ఆర్టీఏ అధికారి ఆనంద్ శ్యాం ప్రసాద్ అన్నారు. శనివారం మోత్కూర్ మున్సిపాలిటీలోని స్థానిక వై జె ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో డి టి ఓ మాట్లాడుతూ, మైనర్లకు వాహనాలు ఇవ్వడం అంటే వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయడమేనని హెచ్చరించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న ప్రేమతో వాహనాలు ఇస్తున్నారని, కానీ అదే ప్రేమ వారి పాలిట శాపంగా మారుతోందన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు మానసిక పరిపక్వత తక్కువగా ఉంటుందని, అత్యవసర సమయాల్లో వాహనాన్ని నియంత్రించలేక ప్రమాదాల(accidents)కు గురవుతున్నారన్నారు.

మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు లేదా వాహన యజమానులకు భారీ జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్‌ను సైతం రద్దు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన మైనర్లకు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్(driving license) పొందే అర్హత ఉండదని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం విచారకరమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టును పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులు వాహనాలతో పాఠశాలలకు రాకుండా కఠిన నియమాలు అమలు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది ఒక సామాజిక బాధ్యత అని అన్నారు. విద్యార్థులు రోడ్ భద్రత విషయాలపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అనంతరం విద్యార్థులచే భద్రత నియమాలు పాటిస్తామని ఇన్స్పెక్టర్(inspector) హర్షవర్ధన్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ ఎస్ హెచ్ ఎం డి అరవింద రాయుడు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పసల మరియన్న, విజయ,బి రవీందర్ రెడ్డి, ఓ సత్యనాధ్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply