గుంటూరు : నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు ఎపి సిఎం చంద్రబాబు. బాధితులు నేడు తమను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు కి రోడ్డెక్కారు. అదే సమయంలో అటు వైపు వెళుతున్న చంద్రబాబు రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని గమనించారు. సడన్‌గా కాన్వాయ్ ఆపించి బాధితులతో మాట్లాడారు.ఈ సందర్భంగా సాయి సాధన చిట్ ఫండ్ లో జరిగిన మోసాన్ని పూసగుచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు వివరించారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లు చెప్పుకొచ్చారు. వారి ఆవేదన చూసి చలించినపోయిన సీఎం.. తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చి వెళ్లారు.
కాగా,సాయి సాధన చిట్ ఫండ్అధినేత పాలడుగు పుల్లారావు సుమారు రూ.170 కోట్లు అప్పు చేసి పరారైన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన గుంటూరు జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో కోర్టు.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం పాలడుగు పుల్లారావును గుంటూరుజిల్లా జైలుకు తరలించారు.
మరోవైపు బాధితులు కోర్టును సైతం ఆశ్రయించారు. నరసరావుపేటలోని అన్ని బ్యాంకులకు సాయి సాధన చిట్ ఫండ్స్ ఆర్ధిక లావాదేవీలు నిలుపుదల చేయాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకోవైపు నరసరావుపేటలోని సాయిసాధన చిట్‌ఫండ్ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు.