Municipal Commissioners | ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ సమీక్ష
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
Municipal Commissioners | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి అన్ని వార్డుల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లోని తన చాంబర్ లో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 30న పోలింగ్ స్టేషన్ల వారీగా డేటాను తిరిగి అమర్చాలని, 31న వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల సమాచారాన్ని పునర్వ్యవస్థీకరించి, అదే రోజు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల రోల్స్‌లో డేటాను చేర్చాలని సూచించారు. జనవరి 1న పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలను స్వీకరించి, అనంతరం నోటీసు బోర్డులపై పోలింగ్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని తెలిపారు. జనవరి 5న మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలని, 6న జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారుల సమీక్ష అనంతరం జనవరి 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆదేశించారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు మున్సిపాలిటీ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపుకు అవసరమైన భవనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ కమిషనర్లకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తదితరులు పాల్గొన్నారు.

