Collector | చివరి దశ ఎన్నికలు

Collector | చివరి దశ ఎన్నికలు
- విజయవంతంగా నిర్వహించండి
- అచ్చంపేట ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
- సామాగ్రి పంపిణీ, భద్రత ఏర్పాట్ల సమీక్ష
- రవాణా అండ్ మైక్రో అబ్జర్వర్లకు సూచనలు
- నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్
Collector | అచ్చంపేట, ఆంధ్రప్రభ : చివరి దశ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ కోరారు. ఇవాళ అచ్చంపేట మండల కేంద్రంలోని బర్కతుల్ల ఫంక్షన్ హాల్లో మూడో విడత ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు.
ఈసందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించి, సామాగ్రి పంపిణీ ప్రక్రియ సక్రమంగా సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని, ఎన్నికల సిబ్బంది లతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కల్పించాలని, పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు.
ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, త్రాగునీరు, లైటింగ్, పార్కింగ్ ప్రదేశాలు, వచ్చిపోయే దారులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, విధులకు హాజరై ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తేనే స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు సాధ్యమవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

