Bellampally | ఎన్నికలకు సర్వం సిద్ధం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌లోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన రెండవ విడత ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,37,362 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తెలిపారు.
అధికారుల పర్యవేక్షణ, సన్నాహాలు
ఎన్నికల సన్నాహాల పర్యవేక్షణలో భాగంగా, బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎన్నికల అధికారి చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీడీవో ఆర్. మహేందర్, తహసీల్దార్ ఎల్. కృష్ణలకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల అధికారులు , సిబ్బంది మొత్తం 2630 మంది విధుల్లో పాల్గొనగా, వీరంతా శనివారం మధ్యాహ్నం 3 గంటలకే ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను తీసుకుని ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు.
ఎన్నికల గణాంకాలు, పోటీ వివరాలు
బెల్లంపల్లి డివిజన్ పరిధిలో మొత్తం 114 సర్పంచ్ స్థానాలకు గాను 334 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే, ఈ డివిజన్‌లో రెండు గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, ఒక గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగడం లేదు. 996 పోలింగ్ కేంద్రాల ద్వారా పోలింగ్ జరగనుంది. మొత్తం 873 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ 2001 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అంతేకాకుండా 111 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు 30 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.
761 మంది పోలీస్ సిబ్బందితో పహరా..
ఎన్నికలు సజావుగా జరిగేందుకు 761 మంది పోలీస్ సిబ్బంది నిరంతరం పహారా కాయనున్నారు. బెల్లంపల్లి ఏసీపీ ఎ. రవికుమార్ ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండవ విడత ఎన్నికలు డివిజన్‌లోని బెల్లంపల్లి రూరల్, తాండూర్, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో జరుగుతాయి.
ఫలితాలు.. ఉత్కంఠ..
పోలింగ్ ముగిసిన తర్వాత, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. డివిజన్ వ్యాప్తంగా కన్నాల, పెర్కపల్లి, పాత బెల్లంపల్లి, బట్వాన్‌పల్లి, ఆకెనపల్లి, బూదా కుర్థు, బుదా కలాన్, అంకుశం, బుచ్చయ్యపల్లి, మాలగురిజాల, తాళ్ళగురిజాల, లంబడితండా, లింగాపూర్ వంటి పలు ముఖ్యమైన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.

