Tulsipaka Ghat Road | చిత్తూరులో అంతిమ‌యాత్ర‌..

Tulsipaka Ghat Road | చిత్తూరులో అంతిమ‌యాత్ర‌..

  • ఒక్కసారిగా ఉలుక్కిపడిన చిత్తూరు జిల్లా
  • శోకసముద్రంలోమృతుల కుటుంబాలు
  • మృతుల కుటుంబాలకు పరామర్శల వెల్లువ

ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : మన్యం జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని తులసిపాక ఘాట్ రోడ్డులో ఈరోజు ఉదయం విజ్ఞేశ్వర ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయిన ఘటన చిత్తూరు జిల్లాను తీవ్ర విషాదంలో ముంచేసింది. అత్యంత ఆనందభరితమైన తీర్థయాత్రగా కుటుంబాలు పంపిన బస్సు ఒక క్షణంలోనే అంతిమయాత్రగా మారిపోయింది.

మూడు రోజుల క్రితం చిత్తూరులోని వివిధ ప్రాంతాల నుండి 35 మంది ప్రయాణికులు అరకు, మారేడుమిల్లి, భద్రాచలం విహారయాత్రకు బయల్దేరారు. కుటుంబాల ఆశలు, పిల్లల ఉత్సాహం, మిత్రుల నవ్వులు నిండిన ఆ యాత్ర వేకువజామున 4.30 గంటల సమయంలో ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రయాణికులు కలలతో బయల్దేరినా, తిరిగి వారిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లాయి.

చిత్తూరుకు జిల్లాకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. మృతుల ఇళ్ల వద్ద పడిన విలాప ధ్వనులు, కన్నీళ్లతో నిండిన వాతావరణం ఈ ప్రమాదం దారుణతను వెల్లడిస్తున్నాయి.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చిత్తూరు…

ప్రమాదం జరిగిన సమాచారం వ్యాపించగానే చిత్తూరు జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. మన వాళ్లు ఉన్నారా? బందువులు ఉన్నారా/ మిత్రులు ఉన్నారా? ఎవరెవరు బతికారు? అని ప్రతి ఇంటిలో ఆందోళన కనిపించింది. టీవీలు, ఫోన్లు, సామాజిక మాధ్యమాలలో ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారు? అని అతుతంగా వెతికారు.

మృతుల్లో గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, తవణంపల్లికి చెందిన దొరబాబు, పలమనేరు ప్రాంతానికి చెందిన సునంద, శివశంకర్ రెడ్డి ఉన్నారన్న సమాచారం బయటకు రావడంతో చిత్తూరు పట్టణం, పలమనేరు, తవణంపల్లి ఒక్క సారిగా దుఃఖ సముద్రంలో కలిసి పోయాయి.

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటన తెలిసిన వెంటనే అల్లూరి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రక్షణ చర్యలు, వైద్యసేవలు, మృతదేహాల తరలింపు వంటి అంశాలను సమన్వయం చేశారు. కుటుంబాలు ఎదురుచూస్తున్న ఆందోళనను తగ్గించేందుకు అధికారులు నిరంతరం సమాచారాన్ని పంపిస్తున్నారు.

శోకసముద్రంలో మృతుల కుటుంబాలు

మృతుల ఇళ్ల వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. విహారయాత్రకు ఉత్సాహంగా పంపిన బంధువులు ఇప్పుడు మృతదేహాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ కన్నీటి ప్రవాహమే. చిన్న పిల్లలు నాన్న ఎక్కడ? ముసలి తల్లిదండ్రులు అయ్యో… నా బిడ్డే… అన్న ఆవేదనతో ఆర్తనాదాలు పక్కవారినీ కన్నీళ్లలో ముంచాయి.

పలమనేరు, తవణంపల్లి, చిత్తూరు పట్టణాల్లో శోక సందర్శనకు చేరిన బంధువులు, పొరుగువారు, గ్రామస్తులు మృతుల కుటుంబాలను ఓదార్చడానికి ప్రయత్నించగా, ఆ బాధను మాటల్లో చెప్పలేని స్థితి. మరణించిన వారి ఇళ్లలో పడ్డ నిశ్శబ్దం, భయంకరమైన కోల్పోవు ధ్వనులతో నిండిపోయింది. కుటుంబాలకు ఆదుకునే చేయిగా ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి.

మృతులకు అండగా ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు

ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతకంటే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని అనేక శాఖలతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం వేగంగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టడం, తీవ్రంగా గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రి నుండి భద్రాచలం ఆసుపత్రికి అత్యవసరంగా తరలించడం జరిగింది. చిత్తూరులోని మరణించినవారి మృతదేహాలను కుటుంబాలకు అందించేందుకు ప్రత్యేకంగా ఫ్రీజర్ బాక్సులతో ఐదు అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు పరామర్శల వెల్లువ

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు నేరుగా మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబాలను పరామర్శించారు. వారి ఆవేదన విని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా, ఇళ్లలో కనిపించిన దుఃఖం ఎవరికి అయినా సహించరానిది. పలమనేరు ఎమ్మార్వో, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మృతుల కుటుంబాలను సందర్శించి ఆప్యాయంగా ఓదార్చారు.

ఈ ప్రమాదం కేవలం ఐదు ప్రాణాలను కాదు, ఐదు కుటుంబాల భవిష్యత్తును, ఆశలను, కలలను కూడా కూలగొట్టింది. చిత్తూరు జిల్లా శుక్రవారం కన్నీళ్లలో తడిసి నిలిచిపోయింది. బస్సు బయల్దేరినప్పుడు ఉన్న నవ్వులు, తిరిగి వచ్చినప్పుడు ఏడుపులు, పెడబోబ్బలుగా మారాయి. అది జిల్లా వాసులు మరచిపోలేని దారుణం.

Leave a Reply