Visranthi Sadan | త్వరలో ‘విశ్రాంతి సదన్’ నిర్మాణం..

Visranthi Sadan| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలో రోగుల బంధువుల కోసం ప్రతిపాదించిన ఆధునిక ‘విశ్రాంతి సదన్’ నిర్మాణానికి సన్నాహాలు వేగవంతమయ్యాయి. రూ.14.6 కోట్ల వ్యయంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (CSR) నిధుల ద్వారా, (NBCC) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ అడిషనల్ డీ.ఎం.ఇ & సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సమీపంలో నిర్మించనున్న ‘విశ్రాంతి సదన్’ మాస్టర్ ప్లాన్ నమూనా, డిజైన్‌లను పవర్ గ్రిడ్ అధికారులు, (NBCC) ఆర్కిటెక్ట్‌లతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు.

ప్రాజెక్ట్ ముఖ్య అంశాలు:
- G+3 అంతస్తుల ఆధునిక వసతి భవనం
- 150 పడకల సామర్థ్యం
- సింగిల్ రూములు, ట్విన్ రూములు, డార్మిటరీలు, మహిళా వసతి గదుల ఏర్పాటు
- దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల అటెండెంట్లకు సురక్షితమైన, పరిశుభ్రమైన వసతి
- ప్రతి అంతస్తులో సౌకర్యవంతమైన గదుల విభజన, అవసరమైన అన్ని భౌతిక సదుపాయాలు
ఈ ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తి అవుతుందని డీ.ఎం.ఇ పేర్కొన్నారు. జీజీహెచ్ పరిసరాల్లో వసతి సమస్యను అధిగమించే కీలక ప్రాజెక్టుగా ‘విశ్రాంతి సదన్’ నిలవనుందని, పవర్ గ్రిడ్ (CSR) సహకారంతో కర్నూలుకు మరో ప్రాధాన్యత కలిగిన ప్రజాసేవ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ సమీక్ష కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, పవర్ గ్రిడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి, (NBCC) డిప్యూటీ జీఎం (ఇంజనీరింగ్) అబ్దుల్ రహీమ్, ఆర్కిటెక్ట్ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

