Ayyappa | స్వాముల సంకీర్తన..

Ayyappa | స్వాముల సంకీర్తన..
Ayyappa, ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో సోమవారం ఉదయం అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన కన్నుల పండువగా సాగింది. గంపోనిగూడెంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గోనె మధుసూదనరావు ఈ ఏడాది తొలిసారిగా అయ్యప్ప మాల ధరించాడు ( కన్నె స్వామి ). అయ్యప్ప మాల ధరించిన గోనె మధుసూదనరావు తన దీక్షా కార్యక్రమంలో భాగంగా తన కుటీరం ( గంపోనిగూడెం కుటీరం) గురు స్వామి పిల్లలమర్రి కరుణాకర్ పర్యవేక్షణలో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలతో గంపోనిగూడెంలోని గోనె మధుసూదన రావు ఇంటి నుండి ప్రారంభమైన అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన కార్యక్రమం గంపోనిగూడెం క్రాస్ రోడ్డు , కోమటిపల్లి క్రాస్ రోడ్డు, తెలంగాణా (Telangana) సెంటర్ మీదుగా మండల కేంద్రంలోని శ్రీ ఉమా చంద్ర శేఖర స్వామి ఆలయం వరకు చేరుకుంది.
అనంతరం అక్కడ నుండి మంగపేట వై జంక్షన్, గంపోనిగూడెం మార్కెట్ గోదాముల మీదుగా గంపోనిగూడెం ఇసుక ర్యాంపు సమీపంలోని పవిత్ర గోదావరి నది వరకు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని పలు వీధుల గుండా మాలాధారులు అయ్యప్ప నామ స్మరణ చేస్తూ, డీజే సిస్టంలో అయ్యప్ప స్వాముల భక్తి పాటలతో, నృత్యాలు చేస్తూ మంగపేట గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి మంగళ హారతులతో, నీరు పోసి స్వాగతించారు. కొంత మంది భక్తులు భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. నగర సంకీర్తన సందర్భంగా అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మంగపేట మండలంలోని పలు గ్రామాలలోని అయ్యప్ప స్వాముల (Ayyappa Swamy) కుటీరాలకు చెందిన గురు స్వాములతో పాటు పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

