Drugs | డ్రగ్స్ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
యువత యాంటి డ్రగ్ సోల్జర్స్‌గా ముందుకు రావాలి
ఎస్పీ వినీత్
Drugs| నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : డ్రగ్స్ యువతను బానిసలుగా మార్చి దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ (SP Dr. Vineet Kumar) ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్. గార్డెన్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ… ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్ ఒక ఉగ్రవాదిలా సమాజాన్ని లోపల నుంచే నాశనం చేస్తున్నాయని హెచ్చరిస్తూ, డ్రగ్స్ (drugs) రహిత సమాజ (Drug-free society) నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రతి యువకుడు, ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌరులు కలిసి యాంటి-డ్రగ్ సొల్జర్లుగా పనిచేస్తేనే ఈ సమస్యను నిర్మూలించవచ్చని పేర్కొన్నారు.
అక్రమంగా గంజాయి లేదా ఇతర డ్రగ్స్ (drugs) రవాణా, విక్రయం, వినియోగం ఎక్కడైనా గమనించిన వెంటనే 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్, సీఐ శివశంకర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సునీత, భజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్, జిల్లా అధ్యక్షుడు వడ్ల శ్రవణ్, నగర అధ్యక్షుడు మురళి బట్టడ్, నరేష్, వెంకటరమణ, వెంకటేష్, ఆకాష్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

