Bandi Sanjay | సర్వేలన్నీ బీజేపీ వైపే.. కేంద్ర మంత్రి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా బీజేపీ బలపర్చిన అభ్యర్థుల విజయం తథ్యమని చెబుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వ్యూహంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ…. ఈ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలంతా తమ పౌరుషాన్ని, దమ్ము చూపాలన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులుగా గెలిపించే బాధ్యత తీసుకుంటామన్నారు.

తెలంగాణలో బీజేపీని ఒక్కసారైనా అధికారంలోకి తీసుకురావాలని లక్షలాది మంది కార్యకర్తలు కల కంటున్నారని, ఎంతో మంది ఆ కల నెరవేరకుండానే చనిపోయారన్నారు. ఈసారి బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులకే ఉందన్నారు. పెద్దపల్లి జిల్లాలోనూ గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, కాశీపేట లింగయ్య, కోమాల అంజనేయులు వంటి వారిని చంపాలని నక్సలైట్లు పెద్ద పోస్టర్లు కూడా వేశారన్నారు. అయినా భయపడకుండా నక్సలైట్లకు ఎదురొడ్డి పోరాడి కాషాయ జెండాను రెపరెపలాడించారన్నారు.

బీసీలకు రిజర్వేషన్ల పేరుతో ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. మనకు గోత్రం, జన్మ నామం, జన్మ నక్షత్రం ఉంటుందని, మన సంప్రదాయాలు వేరని, మరి హిందువుల జాబితాలో ముస్లింలను ఎట్లా కలుపుతారన్నారు. ఒకవైపు బీసీ జనాభాను తగ్గించి చూపుతున్నారని, ఇంకోవైపు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అందులో 10శాతం ముస్లింలకే ఇస్తున్నారన్నారు. బీసీలకు ద్రోహం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటామని, అందుకే బీసీ జాబితాలో ముస్లింలను కలిపి బిల్లు పంపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. వెనక్కు తిరిగి పంపుతామని, ముస్లింలను మినహాయించిన తరువాతే బీసీ బిల్లును ఆమోదిస్తామన్నారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలతోపాటు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *