TG | బీఆర్ఎస్ వి హత్యా రాజకీయాలు – మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో హత్యా రాజకీయాలు పెంచిపోషించిందని, కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు శిక్ష పడుతుందన్న భయంతోనే కోర్టులో కేసు వేసిన రాజలింగమూర్తి హత్య చేయించారని హతుడు కుటుంబం సభ్యులు చెబుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం గాంధీ భవనంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యా, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి , చరణ్ కౌశిక్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్, శ్రీకాంత్ యాదవ్ తో కలసి మంత్రి కోమటిరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. రాజలింగ మూర్తి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తో పాటు ఐదుగురు పై సామాజిక కార్యకర్త రాజలింగం కోర్టులో కేసు వేశారన్నారు. ఈ హత్యను గండ్ర వెంకటరమణారెడ్డి చేయించారని రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు తెలిపారు.
హత్యారాజకీయాలు చేయడమే కేసీఆర్ గ్రాఫ్
తెలంగాణలో అభివృద్ధి జరగ కూడదని బీఆర్ఎస్ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కేసీఆర్ అంటున్నారని, హత్యారాజకీయాలు చేయడమేనా కేసీఆర్ గ్రాఫ్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు కిరాయి హత్యలు చేయించడం కొత్త ఏమి కాదన్నారు. వరంగల్ లో ఎంపీడీఓ ను హత్య బీఆర్ఎస్ వాళ్ళు చేశారని అప్పటి సీపీ రంగనాథ్ చెప్పారని గుర్తు చేశారు. కొడంగల్ లో కలెక్టర్ పై కూడా సురేష్ అనే రౌడీ షీటర్ దాడి చేశారన్నారు.
రాజలింగమూర్తి హత్య సీరియస్‌గా తీసుకుంటాం…
రాజలింగమూర్తి హత్య ను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, గండ్ర వెంకటరమణ రెడ్డి పాత్ర ఉందని, సీబీసీఐడీ విచారణ చేపట్టి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలన్నారు. లగచర్లలో లో కూడా కలెక్టర్ ను చంపాలని చూశారన్నారు. అవినీతి మీద పోరాడే వారికి రక్షణ కల్పిస్తామన్నారు.