Telangana | నిజాయితీ చాటుకున్న యువతి
Telangana భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : మానవత్వం చాటుకునాలనుకునే వారు ఈ రోజుల్లో తక్కువ ఉంటారు. మనిషి వద్ద ఉన్న ధనం కాదు, తన మనసులోని నిజాయితీనే గొప్పదనానికి కొలమానం అని చాకలిబండి స్రవంతి (Sravanti) నిరూపించింది. లింబాద్రి గుట్టలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొన్న వేళ, పల్లికొండ గ్రామానికి చెందిన మేకల సుకీర్తి అనే యువతి తన ఫోన్, పర్సు, రూ.3,000 నగదు పోగొట్టుకుంది. ఆ యువతి బాధతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇదే సమయంలో ఆ ఫోన్, పర్సు దొరికిన భీమ్‌గల్ (Bhimgal) గ్రామానికి చెందిన చాకలి బండి స్రవంతి ఎలాంటి ఆశలు లేకుండా, దొరికిన ఆ వస్తువులను భీమ్‌గల్ పట్టణ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, యువతి అన్నయ్య బట్టు అనిల్‌కు పిలిపించి స్వయంగా ఇవ్వడం జరిగింది.
స్రవంతి (Sravanti) ఈ నిజాయితీ చర్యను చూసి అక్కడున్న వారందరూ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్సై, గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు బర్ల గంగామోహన్, బట్టు అనిల్, బట్టు సునీల్, భీమ రమేష్ తదితరులు ఆమె మానవత్వాన్ని అభినందించారు. సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉన్నంత కాలం మానవత్వం చావదని, స్రవంతి చేసిన పని అందరికీ ఆదర్శమని పలువురు స్రవంతిని అభినందించారు.

