ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

  • వరంగల్ ఎంపీ కడియం కావ్య

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/గణపురం (ఆంధ్రప్రభ) : పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డా. కడియం కావ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు నిర్వహించిన తెల్లకోటు వేడుకలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…. తాను కూడా వైద్య విద్యనభ్యసించి 8 సంవత్సరాలు పాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ మీ వద్దకు వైద్య సేవల కోసం వచ్చే ప్రజలకు ప్రేమతో వైద్య సేవలు అందించాలని అన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యులుగా నిలబడాలంటే ఎన్నో ఆటుపోట్లను, సవాళ్ళను ఎదుర్కొవాల్సి వస్తుందని… ధైర్యంగా ఎదుర్కొని మంచి వైద్యులుగా స్థిర పడాలని సూచించారు. ఈ ప్రాంతానికి వైద్య కళాశాల మణిహారమని మీరు చదువుకున్న కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు. సిన్సియర్ గా పని చేసి ప్రజలకు వ్యాధి తగ్గించి మంచి పేరున్న వైద్యులని పేరు సాధించాలని స్పష్టం చేశారు.

అనుభవాన్ని పొంది ప్రత్యేక వైద్యులుగా నిలవాలి..

వైద్య వృత్తిలో మంచి అనుభవాన్ని పొంది ప్రత్యేక వైద్యులుగా నిలవాలని ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ తెలిపారు. భూపాలపల్లిలో చదివామన్న మంచి పేరు కళాశాలకు, ఈ ప్రాంతానికి తీసుకురావాలని సూచించారు. సింగరేణి, కేటీపీపి సిఎస్ఆర్ నిధులు ఈ ప్రాంత విద్య, వైద్య రంగాలకు కేటాయించాలని తెలిపారు. ఖనిజ సంపద ఇక్కడి నుండే వస్తుంది కాబట్టి విద్యా, వైద్య రంగాలతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని తెలిపారు. 300 మంది విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసించడం పట్ల ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా వెంకటేశ్వరావు, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, కేటీపిపీ సీఈ శ్రీ ప్రకాష్, వైద్య కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply