ongole | సొంతింటితో ఆత్మగౌరవం

ongole | సొంతింటితో ఆత్మగౌరవం

జిల్లా కలెక్టర్ రాజాబాబు


ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : సొంతింటితో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు (P. Rajababu) అన్నారు. అందుకే అర్హులందరికీ సొంత ఇల్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ( 2024 జూన్ ) రాష్ట్రవ్యాప్తంగా పూర్తిచేసిన మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం బుధవారం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఒంగోలు (ongole) నగరంలోని కేశవరాజు కుంట ప్రాంతంలో హౌసింగ్ అధికారులు నిర్వహించారు. కలెక్టర్ తో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ… జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వీటి లబ్ధిదారులకు రూ.17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. అదేవిధంగా వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మంది లబ్ధిదారులకు రూ.18.36 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించినట్లు చెప్పారు. గతంలో రూ.1.80 లక్షలతో పోల్చితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2.0 పథకం కింద రూ.2.50 లక్షలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాతవారికి కూడా ఈ పెంపును వర్తింపచేస్తున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్యే (MLA) మాట్లాడుతూ… పేదలకు సొంత ఇల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒంగోలు నియోజకవర్గంలో 400 ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. లబ్ధిదారులకు రూ.95 లక్షల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. అదేవిధంగా వివిధ దశలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 721మందికి రూ.1.86 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రియాజ్ మాట్లాడుతూ.. గృహప్రవేశాలు చేస్తున్న పేదల జీవితాలలో ఇది ఒక పండుగ రోజు అని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ గృహప్రవేశాలే ఒక నిదర్శనమన్నారు.

మేయర్ (Mayor) మాట్లాడుతూ.. పేదల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులందరూ ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు. తొలుత ఇల్లు మంజూరైన పి.రమాదేవి – శ్రీనివాసరావు దంపతుల గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన బి.సుభాషిణి – కోటేశ్వరరావు దంపతులకు ఇంటి తాళపుచెవి అందించి, ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలను కూడా వీరు అందజేశారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు కూడా సంబంధిత పత్రాలను ఈ సభా కార్యక్రమంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply