సందేహాలపై సందేహాలు – పోలీసుల మౌనం

  • విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు..?

తిర్యాణి, (ఆంధ్రప్రభ) : తిర్యాణి మండలంలోని మంగి పిట్టగూడలో జరిగిన హత్య కేసు మిస్టరీగా మారింది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా పరారీలో ఉన్నాడా అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు.

గత శనివారం సాయంత్రం మంగి పిట్టగూడ ప్రాంతంలో హత్య జరిగిందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే మోహరించి ఆధారాలు సేకరించారు. తిర్యాణి ఎస్ఐ వెంకటేష్ సెలవుపై ఉండడంతో రెబ్బెన సర్కిల్ సీఐ సంజయ్ కేసు విచారణను స్వయంగా చేపట్టారు.

ఆదివారం మధ్యాహ్నం తిర్యాణి పోలీస్ స్టేషన్లో సీఐ మీడియాతో మాట్లాడుతూ. మంత్రాల నేపథ్యంతోనే హత్య జరిగిందని, పిట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావును అదే గ్రామానికి చెందిన రాయిసిడాం వినోద్ గొడ్డలితో నరికి చంపాడని తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని మాత్రమే చెప్పారు.

అయితే నిందితుడు అదుపులో ఉన్నాడా లేదా పరారీలో ఉన్నాడా అనే విషయంపై మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

మంగళవారం మంగి గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, పెద్దలు తిర్యాణి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కేసు పురోగతిపై వివరణ కోరారు. నిందితుడు బయట ఉంటే మాకు ప్రమాదముంది. అతను ఎప్పుడైనా మళ్లీ దాడి చేసే అవకాశం ఉంది. పోలీస్ రక్షణ కావాలని వారు తెలిపారు.

ఈ హత్య కేసులో నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారా? లేక ఇంకా పరారీలో ఉన్నారా? ఉంటే ఎప్పుడు మీడియా ముందుకు తీసుకువస్తారు? అన్న ప్రశ్నలు ప్రజల్లో మారుమ్రోగుతున్నాయి.

ఏదేమైనా మూఢనమ్మకాల పేరుతో అమాయకుల ప్రాణాలు తీయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధితుడి బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply