Top Story – తెలంగాణలో కొత్త ఠాణాలకు గ్రీన్ సిగ్నల్
ఏర్పాటుకు ఓకే చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
కొత్త స్టేషన్లతో పాటు అప్ గ్రేడేషన్లు కూడా!
2012 బ్యాచ్ ఎస్ఐల పదోన్నతుల సమస్యకు పరిష్కారం
పెద్దపల్లి , ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజా సమస్యలను మరింత సత్వరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పోలీస్ స్టేషన్ లతోపాటు ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన దానికనుగుణంగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరగకపోవడం వల్ల జిల్లా కేంద్రాల్లో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ల వద్ద బందోబస్తు నిర్వహణతోపాటు ఇతర కార్యక్రమాల వల్ల పని ఒత్తిడి బాగా పెరిగి పోయింది.
జిల్లా వారీగా ప్రణాళికలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అవసరమున్న ప్రతి చోటా కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుతోపాటు ట్రాఫిక్ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించడంతో పోలీసు ఉన్నతాధికారులు జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాలి, ఎంత సిబ్బంది ఉండాలి, గతంలో ఏ సర్కిల్ పరిధిలో, సబ్ డివిజన్ పరిధిలో ఉంది అనే అంశాలను నివేదిక రూపంలో తయారు చేసి అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాల యూనిట్ ఆఫీసర్లు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదికలు పంపిస్తున్నారు. నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతోపాటు 79 పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో 2012 బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ ల పదోన్నతి సమస్యకు పరిష్కారం లభించనుంది. 317 జీవో వల్ల నష్టపోయిన ఎస్ఐలు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పదోన్నతి పొందనున్నారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలో
రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను ఈ కేటగిరీ నుండి డీ కేటగిరీకి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌ను ఎఫ్ కేటగిరీ నుండి ఈ కేటగిరీకి, సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ను ఈ కేటగిరి నుండి డి కేటగిరీకి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ డి కేటగిరీ నుండి బి కేటగిరీకి అప్‌గ్రేడ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. పెద్దపల్లి రూరల్, పెద్దపల్లి ట్రాఫిక్, పెద్దపల్లి మహిళా, గోదావరిఖని మహిళ, ఎలిగేడు, మంచిర్యాల రెండో పోలీస్ స్టేషన్ లు కొత్తగా ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో…
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ముశ్రా, సలూర, బోధన్ ట్రాఫిక్, ఆర్మూర్ ట్రాఫిక్, దొంకేశ్వర్, ఆలూర్, నందిపేట సర్కిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ వన్ టౌన్, నిజామాబాద్ టు టౌన్, నిజామాబాద్ త్రీ టౌన్, నిజామాబాద్ ఫోర్, నిజామాబాద్ ఫైవ్ టౌన్, నిజామాబాద్ సిక్స్ టౌన్, రూరల్, నవీపేట, మల్కూర్, డిచ్పల్లి, జక్రాన్ పల్లి, ఇందల్వాయి, ఆర్మూర్, నందిపేట, నిజామాబాద్ మహిళా, బోధన్ టౌన్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలు పంపించారు.
కరీంనగర్ కమిషనరేట్‌లో…
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ వన్ టౌన్, ఎల్ఎండి, మానకొండూర్ పోలీస్ స్టేషన్ల ను అప్ గ్రేడ్ చేయాలని అందుకు తగిన సిబ్బందిని కేటాయించాలని నివేదికలు ఉన్నతాధికారులకు పంపించారు.
సిద్దిపేట కమిషనరేట్ లో
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో గజ్వేల్ రూరల్, గజ్వేల్ ట్రాఫిక్, పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయాలని సిద్దిపేట వన్ టౌన్, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలు అందజేశారు.
ఖమ్మం కమిషనరేట్ లో
ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మధిర సబ్ డివిజన్, ఖమ్మం ట్రాఫిక్ 2, సబ్ లేడు, ఎం.వి పాలెం పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు ఖానాపురం, రఘునంద పాలెం, ముదిగొండ, కుసుమంచి, నేలకొండపల్లి, కామేపల్లి, వైరా, కొంజేర్ల, ఎంకూరు, విఎం బంజర్, వేంసూర్, కల్లూర్, తల్లెడ, మదిర టౌన్, మధిర రూరల్, బోనకల్, చింతకాని, ఖమ్మం టూ టౌన్, తిరుమలాయపాలెం, ఎర్రుపాలెం, సత్తుపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ యు సర్కిల్, కాగజ్ నగర్ టౌన్ ట్రాఫిక్, ఆసిఫాబాద్ టౌన్ ట్రాఫిక్, ఆసిఫాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతోపాటు వాంకిడి పోలీస్ స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలు సమర్పించారు.
భూపాలపల్లి జిల్లాలో…
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో నూతనంగా ట్రాఫిక్ భూపాలపల్లి, భూపాలపల్లి మహిళ, ఘన్పూర్ సర్కిల్ కొత్త పలుగూరి పోలీస్ స్టేషన్ల ను ఏర్పాటు చేయడంతో పాటు కాళేశ్వరం, ఘన్పూర్, రేగొండ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
ములుగు జిల్లాలో
ములుగు జిల్లాలో ములుగురు ట్రాఫిక్, అలుబాక, మేడారం పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు ములుగు, వెంకటాపూర్, పసరా, ఎస్ ఎస్ తాడువాయి, మంగపేట, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో బోత్ సబ్ డివిజన్ నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు మావుళ, ఉట్నూరు పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నివేదికలు పంపించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
సిరిసిల్ల రాజన్న జిల్లాలో సిరిసిల్ల ట్రాఫిక్, వేములవాడ ట్రాఫిక్, సిరిసిల్ల మహిళా పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని ఇల్లంత కుంట, వేములవాడ, తంగళ్ళ పల్లి పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ కోసం నివేదికలు పంపించారు.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో భీమారం, ఎండపల్లి పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయడంతో పాటు జగిత్యాల రూరల్, మల్యాల, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల టౌన్, రాయికల్, ధర్మపురి పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ కోసం నివేదికలు పంపించారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో మైసాయిపేట, మెదక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని తూప్రాన్ రూరల్, చేగుంట, మనోహరాబాద్, తూప్రాన్, నర్సాపూర్ పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నివేదికలు పంపించారు
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మల్ ట్రాఫిక్, బైంసా ట్రాఫిక్, నిర్మల్ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు నిర్మల్ టౌన్, బైంసా టౌన్ పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నివేదికలు సమర్పించారు.
కామారెడ్డి జిల్లాలో…
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి ట్రాఫిక్, కామారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్లను నూతనంగా ఏర్పాటు చేయడంతో పాటు దేవన్‌పల్లి, కామారెడ్డి, బిచ్కుండ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపించారు.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో..
భద్రాది కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట సబ్ డివిజన్, అన్నపురెడ్డిపల్లి సర్కిల్, పాల్వంచ ట్రాఫిక్, ఉమెన్ పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని, అలాగే కొత్తగూడెం ట్రాఫిక్, దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని నివేదికలు రూపొందించారు.
మహబూబాబాద్ జిల్లాలో
మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా మహబూబాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కేసముద్రం, గూడూరు, తొర్రూరు, మరిపెడ పోలీస్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు తయారు చేశారు.
పదోన్నతుల సమస్యకు పరిష్కారం
గత ప్రభుత్వం తీసుకు వచ్చిన 317 జీవో వల్ల నష్టపోయిన 2012 బ్యాచ్ కు చెందిన ఎస్ఐలకు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పదోన్నతులు లభించనున్నాయి. 2012 బ్యాచ్ లో 146 మంది ఎస్ఐలుగా పోలీసు శాఖలో చేరగా ఇప్పటి వరకు 60 మంది మాత్రమే ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందారు. నాలుగేళ్ల క్రితం కొంతమందికి పదోన్నతులు రాగా మిగతావారు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. తమ బ్యాచ్‌కు చెందిన వారికే సెల్యూట్ చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పదోన్నతుల సమస్య పరిష్కరించాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. తాజా నిర్ణయంతో 79 పోలీస్ స్టేషన్లు అప్‌గ్రేడ్ అయితే 2012 బ్యాచ్ ఎస్ఐ ల పదోన్నతుల సమస్యకు పరిష్కారం లభించనుంది.