40 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు
- గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
- వాంతులు విరోచనాలతో విద్యార్థుల అవస్థలు.
- వైద్యం అందిస్తున్న గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు.
జోగులాంబ గద్వాల జిల్లా : ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్‌లో నివసిస్తున్న సుమారు 40 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే స్పందించి, బాధిత విద్యార్థులను మూడు 108 అంబులెన్స్ వాహనాలు, కొన్ని ప్రైవేటు వాహనాల సహాయంతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణమే చికిత్స ప్రారంభించగా, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు.
మొత్తం 110 మంది విద్యార్థులు హాస్టల్‌లో ఉంటుండగా, వారిలో 40 మందికి అస్వస్థత కలిగినట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ ఘటన జరిగిందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు విద్యార్థులకు సముచిత వైద్యం అందిస్తున్నారు.

